
0వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ.. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే దేశ ప్రజలు నేడు స్వేచ్ఛను అనుభవిస్తున్నారని అన్నారు. వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జాతీయ జెండా కేవలం మూడు రంగుల సమాహారం కాదని.. కోట్లాది భారతీయుల ఆత్మగౌరవం, ఐక్యత, దేశభక్తికి ప్రతీక అని దేవినేని ఉమా పేర్కొన్నారు. అమరావతిలోని రాయపూడి పరేడ్ మైదానంలో తొలిసారిగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించారని, ‘స్వర్ణాంధ్ర-2047’ లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
‘హర్ ఘర్ తిరంగా’లో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలి
‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం దేశభక్తి భావాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లే గొప్ప కార్యక్రమమని దేవినేని ఉమా అన్నారు. ప్రతి కుటుంబం జాతీయ జెండాను ఎగురవేసి దేశం పట్ల తమ గౌరవాన్ని చాటాలని పిలుపునిచ్చారు.
స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధి, రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో దేశం, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని తెలిపారు.
దేశ సమైక్యతను కాపాడటం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడం, అభివృద్ధి-సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే స్వాతంత్ర్య సమరయోధులకు అందించే నిజమైన నివాళి అని దేవినేని ఉమా అన్నారు.

