న్యూఢిల్లీ, కేంద్ర బడ్జెట్‌ 2027-28 రూపకల్పనకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పెరుగుతున్న ఆహార ధరలు, పన్నుల వసూళ్లలో మందగమనం, సబ్సిడీల భారం ప్రభుత్వానికి సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వృద్ధిని కొనసాగించడం, కొత్త ఉద్యోగాలను సృష్టించడం, ద్రవ్యలోటును నియంత్రించడం కేంద్రానికి కీలకంగా మారింది.

ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు, పరిశ్రమలకు ముడిసరుకుల ధరల తగ్గింపు, తయారీ రంగం అభివృద్ధి, యువతకు ఉపాధి నైపుణ్యాల కల్పనకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నవంబర్ 20న ఉపాధి, కార్మిక రంగ ప్రతినిధులతో బడ్జెట్ ముందస్తు సంప్రదింపులు నిర్వహించారు.

ద్రవ్యలోటు.. ఆదాయ వసూళ్లపై ఒత్తిడి

2026-27 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యలోటును 4.3 శాతానికి పరిమితం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఎరువులు, ఇంధన సబ్సిడీల వ్యయం పెరగడం, పన్నుల వసూళ్లు తగ్గడం వల్ల ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమయ్యే అవకాశం ఉందని ఐసీఆర్‌ఏ చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ అభిప్రాయపడ్డారు.

ఆమె అంచనా ప్రకారం.. ద్రవ్యలోటు లక్ష్యాన్ని మించి రూ.1.3 లక్షల కోట్ల నుంచి రూ.1.4 లక్షల కోట్ల వరకు అదనపు భారం ఏర్పడవచ్చు. 2026-27 తొలి ఆరు నెలల్లో స్థూల పన్ను ఆదాయ వృద్ధి కేవలం 6.1 శాతానికే పరిమితమైంది. ఎక్సైజ్ వసూళ్లు తగ్గడం, వ్యక్తిగత ఆదాయపు పన్ను వృద్ధి మందగించడం ఇందుకు కారణాలని తెలిపారు.

అయితే ఇతర విభాగాల్లో వ్యయాన్ని తగ్గించడం, చిన్న మొత్తాల పొదుపు పథకాల ద్వారా నిధుల సమీకరణ పెరగడం వల్ల కొంత ఉపశమనం లభించవచ్చని ఆమె పేర్కొన్నారు.

10.5 నుంచి 11 శాతం మధ్య జీడీపీ వృద్ధి అంచనా

ఎలారా సెక్యూరిటీస్ ఎకనామిస్ట్ గరిమా కపూర్ అంచనా ప్రకారం.. 2027-28లో నామినల్ జీడీపీ వృద్ధి 10.5 నుంచి 11 శాతం మధ్య ఉండవచ్చు. వాస్తవ ఆర్థిక వృద్ధి 7 నుంచి 7.2 శాతం వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. చమురు, ఇతర వస్తువుల ధరల ఒత్తిడి తగ్గుతుందన్న అంచనాతో ఈ గణాంకాలను రూపొందించినట్లు వివరించారు.

ప్రైవేటీకరణ, ఆస్తుల నగదీకరణపై దృష్టి

మరోవైపు క్రిసిల్ చీఫ్ ఎకనామిస్ట్ ధర్మకీర్తి జోషి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ప్రభుత్వ ఆస్తుల నగదీకరణను వేగవంతం చేయాలని సూచించారు. తద్వారా సమీకరించిన నిధులను మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించవచ్చని అభిప్రాయపడ్డారు.

మొత్తంగా ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ ఆదాయ పెంపు, ద్రవ్యలోటు నియంత్రణ మధ్య సమతుల్యత సాధించడం 2027-28 కేంద్ర బడ్జెట్‌లో కీలకంగా మారనుంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *