
అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలో ఉన్న అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అమెరికా ఇంధన శాఖకు చెందిన సవన్నా రివర్ నేషనల్ లేబొరేటరీలోని ఓ గదిలో బుధవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. దీంతో రేడియేషన్ లీకేజీ జరిగిందేమోనన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
రెండు గంటల్లో అదుపులోకి మంటలు
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన అధికారులు సుమారు రెండు గంటల్లోనే మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. భవనం వెలుపలికి రేడియోధార్మిక పదార్థాలు విడుదల కాలేదని, వాటి ప్రభావం లేబొరేటరీ ప్రాంగణానికే పరిమితమైందని తెలిపారు. సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు.
ముందు జాగ్రత్త చర్యలు
ప్రమాదం నేపథ్యంలో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. లేబొరేటరీ ప్రవేశ మార్గాలను మూసివేయడంతో పాటు, సమీప ప్రాంతాల్లో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, రేడియోధార్మిక పదార్థాలకు సంబంధించి పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
