పెనుగంచిప్రోలు, సెప్టెంబర్ 7: భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రహదారుల పునర్నిర్మాణ పనులకు జగ్గయ్యపేట ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సోమవారం శంకుస్థాపన చేశారు. పెనుగంచిప్రోలులోని శృతి కన్వెన్షన్ హాల్ వద్ద కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.

పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లోని పలు రహదారులు వరదల కారణంగా దెబ్బతినడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, రహదారుల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయించారని తెలిపారు. ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సహకారంతో పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

రూ.3.37 కోట్లతో 8 కిలోమీటర్ల రహదారుల పునర్నిర్మాణం

ముచ్చింతల, వత్సవాయి, వేమవరం, గుమ్మడిదూరు, అనిగండ్లపాడు, కాకరవాయి తదితర గ్రామాలను కలిపే ప్రధాన రహదారులను సుమారు రూ.3.37 కోట్ల వ్యయంతో 8 కిలోమీటర్ల మేర పునర్నిర్మించనున్నారు. పనులు పూర్తయితే ఆయా గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభతరం కానున్నాయి. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, ప్రజా రవాణా వాహనదారులకు ప్రయోజనం చేకూరనుంది.

ప్రజలకు సురక్షితమైన రాకపోకలు, మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తెలిపారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సహకారంతో మరిన్ని పనులు చేపడతామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *