అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బీసీ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పీ4 విధానంలో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు సిద్ధమయ్యే బీసీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏపీ బీసీ సంక్షేమశాఖ, డాక్టర్‌ లక్ష్మయ్య ఐఏఎస్‌ అకాడమీతో ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి ఎస్‌. సవిత సమక్షంలో అధికారులు, అకాడమీ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు.

అర్హత పరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా 100 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారికి నిపుణులైన అధ్యాపకులతో శిక్షణ ఇవ్వడంతోపాటు ఉచితంగా స్టడీ మెటీరియల్‌, వసతి సదుపాయం కల్పించనున్నారు. సివిల్స్‌ మెయిన్స్‌కు అర్హత సాధించిన బీసీ అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకం అందిస్తామని పీ4 ఫౌండేషన్‌ వైస్‌ ఛైర్మన్‌ కుటుంబరావు ప్రకటించారు.

ఇతర పోటీ పరీక్షలకూ ఉచిత శిక్షణ

బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైన వెంటనే అర్హులైన అభ్యర్థులకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానాల్లో ఉచిత శిక్షణ అందిస్తామని మంత్రి సవిత తెలిపారు. త్వరలో గ్రూప్‌-1, ఎస్సై, పోలీస్‌ కానిస్టేబుల్‌ పోటీ పరీక్షలకు కూడా కోచింగ్‌ కల్పించనున్నట్లు వెల్లడించారు.

మైనార్టీ అభ్యర్థులకు గ్రూప్‌-2 కోచింగ్‌

మరోవైపు, ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 పరీక్షలకు సిద్ధమయ్యే అర్హులైన మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ప్రకటించారు. సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ మైనార్టీస్‌ (సీఈడీఎం) ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.

అర్హులైన అభ్యర్థులు apcedmmwd.org వెబ్‌సైట్‌ ద్వారా లేదా 08645-297535, 7386789966 నంబర్లలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఆఫ్‌లైన్‌ శిక్షణకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు బీపీఎల్‌ కార్డు తప్పనిసరి అని స్పష్టం చేశారు. దరఖాస్తులకు ఈ నెల 31 చివరి తేదీగా ప్రకటించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *