నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నూతనంగా నిర్మించిన బైపాస్ రోడ్డును ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ బైపాస్ రోడ్డుకు ‘వాయుపుత్ర’గా నామకరణం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా బైపాస్ రహదారిని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ముంబై జాతీయ రహదారి నుంచి ఆత్మకూరు పట్టణానికి అనుసంధానంగా సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రహదారిని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చొరవతో ఈ బైపాస్ రోడ్డు అభివృద్ధి సాధ్యమైందని అభినందించారు.
నెల్లూరులో 105 అడుగుల జాతీయ జెండా
నెల్లూరు నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. నగరంలోని మినీబైపాస్ రోడ్డులో ఐకానిక్ జాతీయ జెండా ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు. నుడా ఆధ్వర్యంలో 105 అడుగుల ఎత్తైన స్థంభంపై జాతీయ జెండాను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రజల్లో దేశభక్తి భావనను పెంపొందించేందుకు స్వాతంత్ర్య సమరయోధులు దండి యాత్రకు సంబంధించిన చిత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కోటంరెడ్డి వివరించారు. ఇతర మహానగరాల నుంచి కూడా పర్యాటకులు నెల్లూరును సందర్శించేలా నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ‘ఐ లవ్ నెల్లూరు’ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.