పాలకూరతో పప్పు, పులుసు, పరాఠాలు, రకరకాల కూరలు తయారు చేసుకోవచ్చు. అయితే ప్రతిసారీ మార్కెట్‌కు వెళ్లి పాలకూర కొనడానికి బదులుగా ఇంట్లోనే తాజాగా పెంచుకుంటే మరింత సౌకర్యంగా ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా తోట ఉండాల్సిన అవసరం లేదు. కిటికీ పక్కన సూర్యరశ్మి అందే ప్రదేశం, నీరు నిల్వ ఉండకుండా బయటకు వెళ్లే రంధ్రాలున్న కుండీ, నాణ్యమైన మట్టి ఉంటే చాలు. సరైన పద్ధతిలో విత్తనాలు నాటి, మొక్కకు తగినంత వెలుతురు, నీరు అందిస్తే ఇంట్లోనే తాజా పాలకూరను పండించుకోవచ్చు. ఇలా తక్కువ స్థలంలోనే సొంతంగా ఆకుకూరలను పెంచుకుని, అవసరమైనప్పుడు కోసి వంటల్లో ఉపయోగించుకోవచ్చు.

పాలకూర చల్లటి వాతావరణంలో బాగా పెరిగే ఆకుకూర. అయితే తీవ్రమైన ఎండలు, అధిక ఉష్ణోగ్రతలు మొక్క ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. ఇంట్లో సరైన ప్రదేశంలో కుండీని ఉంచి, తగినంత వెలుతురు, నీరు, పోషకాలు అందిస్తే తాజా పాలకూరను సులభంగా పెంచుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా తోట ఉండాల్సిన అవసరం లేదు. బాల్కనీ, కిటికీ పక్కన లేదా కొద్దిగా వెలుతురు వచ్చే ప్రదేశంలోనూ పాలకూరను పెంచుకోవచ్చు. సాధారణంగా విత్తనాలు నాటిన నాలుగు నుంచి ఆరు వారాల్లో మొదటి కోతకు అవకాశం ఉంటుంది. ఇంట్లోనే ఆరోగ్యకరమైన పాలకూరను పెంచుకోవాలంటే ఈ ఐదు ముఖ్యమైన చిట్కాలను పాటించండి.

1. సరైన కుండీ, మట్టిని ఎంచుకోండి

పాలకూర సాగుకు కనీసం 6 నుంచి 8 అంగుళాల లోతు ఉన్న కుండీని ఎంచుకోవాలి. కుండీ అడుగున నీరు బయటకు వెళ్లేందుకు రంధ్రాలు ఉండటం తప్పనిసరి. నీరు నిలిచిపోతే వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. వెడల్పుగా ఉండే దీర్ఘచతురస్రాకార ప్లాంటర్‌ను ఉపయోగిస్తే ఒకేసారి ఎక్కువ మొక్కలను పెంచుకోవచ్చు.

మట్టి విషయానికి వస్తే నీరు సులభంగా బయటకు వెళ్లే తేలికపాటి పాటింగ్ మిక్స్‌ను ఉపయోగించాలి. అందులో కంపోస్ట్ లేదా వర్మీకంపోస్ట్ కలిపితే మొక్కలకు అవసరమైన పోషకాలు అందుతాయి. పాలకూర సారవంతమైన, తేమను నిలుపుకునే మట్టిలో బాగా పెరుగుతుంది. తోటలోని బరువైన మట్టిని నేరుగా కుండీలో నింపడం కంటే, గాలి ప్రసరణకు అనుకూలమైన మిశ్రమాన్ని ఉపయోగించడం మంచిది.

2. పాలకూర విత్తనాలను సరైన పద్ధతిలో నాటండి

ముందుగా కుండీలో మట్టిని నింపి, పాలకూర విత్తనాలను సుమారు ఒక అంగుళం దూరంలో నాటాలి. వాటిపై అర అంగుళం మందంలో మట్టిని కప్పి, తేలికగా నీటిని పోయాలి. నీటి ఒత్తిడికి విత్తనాలు పక్కకు కొట్టుకుపోకుండా జాగ్రత్త పడాలి.

సాధారణంగా పాలకూర విత్తనాలు వారం రోజుల్లో మొలకెత్తుతాయి. అయితే వాతావరణం, మట్టి ఉష్ణోగ్రతను బట్టి ఈ సమయం మారవచ్చు. విత్తనాలను నాటే ముందు కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టడం కొన్ని రకాల విత్తనాల్లో మొలకెత్తే ప్రక్రియకు సహాయపడవచ్చు.

మొలకలు కొన్ని అంగుళాల ఎత్తు పెరిగిన తర్వాత వాటి మధ్య తగినంత ఖాళీ ఉండేలా పలుచన చేయాలి. దీనివల్ల ప్రతి మొక్కకు ఎదగడానికి అవసరమైన స్థలం లభిస్తుంది. తీసిన లేత మొలకలు తినడానికి అనుకూలంగా ఉంటే వాటిని సలాడ్లలో ఉపయోగించుకోవచ్చు.

3. తగినంత వెలుతురు, చల్లని వాతావరణం కల్పించండి

పాలకూర మొక్కలకు రోజుకు సుమారు నాలుగు నుంచి ఆరు గంటలపాటు సూర్యరశ్మి లేదా తగినంత ప్రకాశవంతమైన వెలుతురు అవసరం. తూర్పు వైపు ఉన్న కిటికీ దగ్గర కుండీని ఉంచడం అనుకూలంగా ఉంటుంది. సహజమైన వెలుతురు తక్కువగా ఉండే ఇంట్లో మొక్కల పెరుగుదలకు ఉపయోగించే ఎల్‌ఈడీ గ్రో లైట్లను ఉపయోగించవచ్చు.

పాలకూరకు సుమారు 15 నుంచి 21 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది. ఉష్ణోగ్రత ఎక్కువైతే మొక్క త్వరగా పూతకు వచ్చి, ఆకుల రుచి చేదుగా మారవచ్చు. ఈ ప్రక్రియను బోల్టింగ్ అంటారు.

ముఖ్యంగా వేసవిలో మధ్యాహ్నం తీవ్రమైన ఎండ తగలని, గాలి బాగా ప్రసరించే ప్రదేశంలో కుండీని ఉంచాలి. ఇంటి లోపల పెంచుతున్నా మొక్కలకు తగినంత వెలుతురు అందేలా చూసుకోవాలి.

4. నీరు, ఎరువులను సరైన మోతాదులో ఇవ్వండి

పాలకూర మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి మట్టిలో తగినంత తేమ ఉండాలి. అయితే మట్టి ఎప్పుడూ నీటితో నిండిపోయి ఉండకూడదు. మట్టిపైభాగం పొడిగా కనిపించినప్పుడల్లా వెంటనే నీరు పోయకుండా, వేలితో సుమారు ఒక అంగుళం లోతులో తేమను పరిశీలించాలి. ఆ భాగం పొడిగా అనిపించినప్పుడు నీరు పోయాలి.

సాధ్యమైనంతవరకు మొక్క అడుగు భాగంలో నీరు పోయడం మంచిది. ఆకులు ఎక్కువసేపు తడిగా ఉండటం వల్ల కొన్ని రకాల శిలీంధ్ర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

పాలకూర ఆకులు పచ్చగా, ఆరోగ్యంగా పెరగడానికి నత్రజనితో పాటు ఇతర పోషకాలు కూడా అవసరం. ఇందుకోసం మొక్కల పెరుగుదల దశను బట్టి ప్రతి రెండు నుంచి మూడు వారాలకు ఒకసారి పలుచగా కలిపిన ద్రవరూప ఎరువును లేదా కొద్దిగా కంపోస్ట్‌ను ఉపయోగించవచ్చు. ఎరువులను అధికంగా వేయకూడదు. ఆకులు పసుపు రంగులోకి మారితే పోషకాల లోపంతో పాటు నీరు అధికంగా నిలవడం వంటి కారణాలు కూడా ఉండవచ్చు. కాబట్టి ముందుగా మట్టిలో తేమ, నీరు బయటకు వెళ్లే విధానాన్ని పరిశీలించాలి.

5. ఆకులను కోస్తూ కొత్త విత్తనాలు నాటండి

పాలకూర ఆకులు సుమారు 3 నుంచి 4 అంగుళాల పొడవు పెరిగినప్పుడు కోయడం ప్రారంభించవచ్చు. సాధారణంగా విత్తనాలు నాటిన నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత మొదటి కోతకు అవకాశం ఉంటుంది. అయితే వాతావరణం, మొక్క రకం, పెరుగుదల పరిస్థితులను బట్టి ఈ సమయం మారుతుంది.

ఆకులను కోసేటప్పుడు బయటివైపు పెరిగిన పెద్ద ఆకులను ముందుగా కత్తిరించాలి. మొక్క మధ్యలో ఉండే చిన్న ఆకులను అలాగే వదిలేస్తే అవి పెరుగుతాయి. ఇలా జాగ్రత్తగా కోస్తే ఒకే మొక్క నుంచి మరికొంతకాలం తాజా ఆకులను పొందవచ్చు.

ఎక్కువకాలం ఇంట్లోనే పాలకూర అందుబాటులో ఉండాలంటే ప్రతి రెండు వారాలకు ఒకసారి కొత్త విత్తనాలను నాటడం మంచిది. ఇలా విడతలవారీగా నాటితే అన్ని మొక్కలూ ఒకేసారి కోతకు రావు. పూతకు వచ్చి ఆకుల రుచి మారిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను పెంచుకోవచ్చు.

ఇలా సరైన కుండీ, నాణ్యమైన మట్టి, తగినంత వెలుతురు, నీరు, పోషకాలను అందిస్తే ఇంట్లోనే తాజా పాలకూరను పెంచుకోవచ్చు. మార్కెట్ నుంచి తరచూ కొనుగోలు చేయాల్సిన అవసరాన్ని కొంతవరకు తగ్గించుకోవడంతో పాటు, అవసరమైనప్పుడు తాజాగా కోసిన ఆకులను వంటల్లో ఉపయోగించుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *