
పోలవరం జిల్లా చింతూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొడ్డుగూడెం–విద్యానగరం గ్రామాల మధ్య జాతీయ రహదారి-30పై శుక్రవారం రాత్రి లారీ, కారు ఢీకొన్నాయి. ప్రమాదం అనంతరం కారులో మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది.
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు సజీవ దహనం కాగా.. మరొకరు తీవ్ర గాయాలతో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
భద్రాచలం నుంచి ఇద్దరు వ్యక్తులు కారులో చింతూరు వైపు వస్తుండగా.. ఒడిశా నుంచి చింతూరు మీదుగా భద్రాచలం వెళ్తున్న లారీతో ఎదురెదురుగా ఢీకొన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత లారీ కారును కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న చింతూరు సీఐ గోపాలకృష్ణ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

