విజయవాడ, : రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 30న విజయవాడలో 24,057 కుటుంబాలకు ఇళ్ల పట్టాలను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పట్టాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు.

గతంలో జారీ చేసిన ఎన్టీఆర్ ఇళ్ల పట్టాలకు చట్టబద్ధత కల్పించి, లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పించనున్నారు. దీంతో విజయవాడ నగర పరిధిలోని కొండ ప్రాంతాల్లో ఏళ్లుగా నివసిస్తున్న పేద కుటుంబాలకు స్థిరమైన హక్కులు లభించనున్నాయి.

ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ నిర్ణయం ద్వారా సుమారు 617 ఎకరాల భూమి లబ్ధిదారుల పరిధిలోకి రానుంది. ఈ భూమి ప్రభుత్వ విలువ సుమారు రూ.9,800 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ.24,297 కోట్లుగా ఉంటుందని అంచనా. ఇళ్ల పట్టాలతో పాటు లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు పొందేందుకు, అవసరమైతే ఇళ్లను పునర్నిర్మించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.

15 మండలాలు, 15 నియోజకవర్గాలకు ప్రయోజనం

ఈ పట్టాల పంపిణీ ద్వారా కృష్ణా జిల్లాలోని గన్నవరం సహా ఎనిమిది నియోజకవర్గాల పరిధిలోని 15 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ప్రజలకు ప్రయోజనం కలగనుంది. బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందిన అర్హులైన కుటుంబాలు కూడా ఈ పట్టాలు పొందనున్నారు.

కొండ ప్రాంతాల్లోని నివాసాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.

విశాఖలో 28,445 కుటుంబాలకు పట్టాలు

ఇప్పటికే విశాఖపట్నంలో 28,445 పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. గాజువాక నుంచి భీమిలి వరకు వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న అర్హులైన కుటుంబాలకు ఈ పట్టాలు అందించారు. తాజాగా విజయవాడలో 24,057 కుటుంబాలకు పట్టాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

By Ramya