అమరావతి,: తీవ్ర వాయుగుండం ప్రభావంతో సముద్రంలో చేపల వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో నెలకొన్న వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం విదేశాల నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టం, సహాయక చర్యలు, సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిపై సమీక్షించారు.

భారీ వర్షాల కారణంగా ఉత్తరాంధ్రలోని పలు నివాస ప్రాంతాలు నీటమునిగాయని, వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రిజర్వాయర్లకు వస్తున్న వరద ప్రవాహాలు, నీటి నిల్వల పరిస్థితిని సీఎంకు తెలియజేశారు. పలు జిల్లాల్లో రిజర్వాయర్లను నింపేందుకు చేపడుతున్న చర్యలను వివరించారు.

ఉత్తరాంధ్రలో ముంపు పరిస్థితిపై మంత్రి అచ్చెన్నాయుడు కూడా ముఖ్యమంత్రికి సమాచారం అందించారు. మరోవైపు కాకినాడ నుంచి చేపల వేటకు వెళ్లిన తొమ్మిది మంది మత్స్యకారులు ఒడిశాలోని పారాదీప్‌కు సురక్షితంగా చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

హిరమండలం లిఫ్ట్‌ పనులను వేగవంతం చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కృష్ణా వరద జలాలను నిల్వ చేసేందుకు అవసరమైన బ్యారేజీలు, ఆనకట్టల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని సూచించారు.

By Ramya