
భారతీయ సమాజంలో పీరియడ్స్ పట్ల మూఢనమ్మకాలు ఉంటాయి. అంతేకాకుండా పీరియడ్స్ అనేది కేవలం తల్లి-కూతుళ్ల విషయంగానే చూస్తుంటారు. కానీ ఈ ఆలోచన మారాల్సిన అవసరం ఉంది. అపోహలను తొలగించడం ప్రతి ఒక్కరి బాధ్యత. పీరియడ్స్ అనేది ఒక సాధారణ శారీరక ప్రక్రియ అని, ఇందులో భయపడటానికి లేదా దాచడానికి ఏమీ లేదని తండ్రి కూడా మాట్లాడటం వల్ల అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్కూల్ లేదా బయటి పని మీద వెళ్లినప్పుడు తండ్రి వద్ద శానిటరీ ప్యాడ్లు అడగడానికి సంకోచించని వాతావరణం ఇంట్లో ఉండాలి. కూతురితో మొదటి పీరియడ్స్ గురించి ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం.
భారతీయ కుటుంబాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలతో పీరియడ్స్ (రుతుక్రమం) గురించి మాట్లాడటానికి తరచుగా సంకోచిస్తుంటారు. కానీ, పీరియడ్స్ అనేది ఒక సహజమైన శారీరక ప్రక్రియ. మనం మాట్లాడినా మాట్లాడకపోయినా, ఈ మార్పుల గురించి అమ్మాయిలు తెలుసుకోవడం ఆపలేం. ముఖ్యంగా అమ్మాయికి మొదటిసారి పీరియడ్స్ వచ్చే ముందే, ఈ ప్రక్రియపై ఆమెకు పూర్తి అవగాహన కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత. కేవలం శారీరక మార్పుల గురించే కాకుండా, సమాజంలో ఉన్న సవాళ్లు, మూఢనమ్మకాల పట్ల కూడా ఆమెను చైతన్యపరచాలి.
ఆమెకు ఇప్పటికే పీరియడ్స్ గురించి ఏమైనా తెలుసా అని అడిగి తెలుసుకోండి. స్కూల్లో ఉపాధ్యాయుల ద్వారా లేదా స్నేహితుల ద్వారా ఆమెకు కొంత సమాచారం తెలిసి ఉండొచ్చు. ఆమె చెప్పేది విన్న తర్వాత, ఒకవేళ ఆ సమాచారం అరకొరగా లేదా తప్పుగా ఉంటే, సరైన విషయాన్ని వివరించండి.
పీరియడ్స్ గురించి వివరించేటప్పుడు సైన్స్ క్లాస్‌లాగా శాస్త్రీయంగా మాట్లాడటం చాలా మంచిది. పీరియడ్స్ అనేవి మహిళల శరీరాన్ని భవిష్యత్తులో గర్భధారణకు సిద్ధం చేసే ఒక ప్రక్రియ అని చెప్పండి. గర్భాశయం ప్రతి నెలా హార్మోన్ల ప్రభావంతో పొరను ఏర్పాటు చేసుకుంటుంది. గర్భధారణ జరగనప్పుడు ఆ పొర రక్త రూపంలో యోని ద్వారా బయటకు వస్తుంది.

