హైదరాబాద్‌ మెట్రో రెండో దశ విస్తరణకు నిధుల సమీకరణ, ఆర్థిక సాయం అంశాలు తన పరిధిలోకి రావని కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పష్టం చేశారు. ఐఆర్‌ఎఫ్‌సీ ద్వారా రుణం అందించే ప్రతిపాదనపై కూడా తనకు ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు. గతంలో మెట్రో ఫేజ్‌-2కు నిధులు, అనుమతుల కోసం సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆయనను కలిసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో హైదరాబాద్‌ మెట్రో రెండో దశ విస్తరణ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.

మరోవైపు, దేశంలో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది మే నెలలో బుల్లెట్‌ రైలు ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన రైలు కోచ్‌లు ఏప్రిల్‌ నాటికి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న హైదరాబాద్‌ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి కేంద్రం నుంచి ఎదురుదెబ్బ తగిలింది. మెట్రో ఫేజ్‌-2 నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించే అంశం తన పరిధిలోకి రాదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ ప్రాజెక్టుకు ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ) రుణం మంజూరు చేస్తుందన్న విషయం కూడా తనకు తెలియదని పేర్కొన్నారు. మెట్రో రెండో దశకు నిధులు, అనుమతుల కోసం సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు కేంద్ర మంత్రిని కలిసిన నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఐఆర్‌ఎఫ్‌సీ రుణంపై అశ్వినీ వైష్ణవ్‌ ఏమన్నారంటే?

హైదరాబాద్‌ మెట్రో రెండో దశ విస్తరణకు అవసరమైన నిధులు సమకూర్చాలని తెలంగాణ ప్రభుత్వం కొంతకాలంగా కేంద్రాన్ని కోరుతోంది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. మెట్రో ఫేజ్‌-2కు అవసరమైన అనుమతులు, ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు, ఐఆర్‌ఎఫ్‌సీ ద్వారా మెట్రో రెండో దశకు రుణం అందించే ప్రతిపాదనపైనా గతంలో చర్చలు జరిగాయి. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సైతం సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి అశ్వినీ వైష్ణవ్‌తో ఈ అంశంపై మాట్లాడారు. అయితే సోమవారం మీడియాతో జరిగిన ఇష్టాగోష్ఠిలో హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు ఆర్థిక సాయం అందించడం తన పరిధిలోని అంశం కాదని, ఐఆర్‌ఎఫ్‌సీ రుణ ప్రతిపాదన గురించి కూడా తనకు తెలియదని ఆయన పేర్కొన్నారు. దీంతో హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2కు నిధుల సమీకరణ, కేంద్రం నుంచి అనుమతుల విషయంలో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు, దేశంలో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. వచ్చే ఏడాది మే నెలలో బుల్లెట్‌ రైలుకు ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ రైలు గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుందని తెలిపారు.

అహ్మదాబాద్‌–ముంబై మధ్య నిర్మిస్తున్న బుల్లెట్‌ రైలు కారిడార్‌లో భాగంగా సూరత్‌–బిలిమొరా సెక్షన్‌లో 50 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లోనూ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి బుల్లెట్‌ రైలు కోచ్‌లు అందుబాటులోకి వస్తాయని, 2029 నాటికి ఈ రైలు థానే వరకు చేరుకుంటుందని వెల్లడించారు.

రైల్వేకు రూ.1,078 కోట్ల అదనపు ఆదాయం

రైల్వే శాఖలో చేపట్టిన సంస్కరణల గురించి కూడా అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు. ముఖ్యంగా సరకు రవాణా విభాగంలో అమలు చేసిన పలు మార్పుల వల్ల రైల్వేకు అదనంగా రూ.1,078 కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపారు.

ఈ ఏడాది ఇప్పటివరకు రైళ్లలో 800 కోట్ల మంది ప్రయాణాలు చేసినట్లు వెల్లడించారు. 1980 నుంచి కొనసాగుతున్న టికెటింగ్‌ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి, దాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసినట్లు కేంద్ర మంత్రి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *