
భక్తుల కోసం ఐఆర్సీటీసీ (IRCTC) మరో ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టింది. ‘వారణాసి–అయోధ్య పుణ్యక్షేత్ర యాత్ర’ పేరుతో భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలును నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైలు 2026 డిసెంబర్ 5న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరనుంది.
మొత్తం 9 రాత్రులు, 10 రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక యాత్ర కొనసాగనుంది. భక్తుల సౌకర్యార్థం రైలులో 705 సీట్లను అందుబాటులో ఉంచారు. ఈ ప్రత్యేక యాత్రలో భాగంగా ప్రయాణికులు ఐదు ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించి, దైవదర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకునే భక్తులకు ఈ ప్రత్యేక రైలు ప్రయాణం ఎంతగానో ఉపయోగపడనుంది.
ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లాలనుకునే తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరో ప్రత్యేక టూరిజం ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ‘వారణాసి–అయోధ్య పుణ్యక్షేత్ర యాత్ర’ పేరుతో భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలును నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైలు 2026 డిసెంబర్ 5న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది.
10 రోజుల పాటు ఆధ్యాత్మిక యాత్ర
మొత్తం 9 రాత్రులు, 10 రోజుల పాటు సాగే ఈ యాత్రలో ప్రయాణికుల కోసం 705 బెర్త్‌లను కేటాయించారు. ఇందులో స్లీపర్ (ఎకానమీ) విభాగంలో 237, థర్డ్ ఏసీలో 416, సెకండ్ ఏసీలో 52 బెర్త్‌లు అందుబాటులో ఉంటాయి.
రెండు తెలుగు రాష్ట్రాల భక్తులకు ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేలా పలు రైల్వే స్టేషన్లలో రైలు నిలుపుదల ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో ప్రయాణికులు రైలు ఎక్కే అవకాశం కల్పించారు.
ఈ ప్రత్యేక రైలు ద్వారా తెలుగు రాష్ట్రాల భక్తులు వారణాసి, అయోధ్యతో పాటు ఇతర ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం పొందనున్నారు.
ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా భక్తులు దేశంలోని ఐదు ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం కల్పించారు. పూరిలోని జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, బద్రీనాథ్ ధామ్తో పాటు వారణాసిలో కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి అమ్మవారు, అన్నపూర్ణ దేవి ఆలయాలను దర్శించుకోవచ్చు. అంతేకాకుండా కాశీ కారిడార్ సందర్శన, సాయంత్రం గంగా హారతి వీక్షించే సదుపాయం కూడా ఉంటుంది.
అనంతరం అయోధ్యలో బాల రాముడి ఆలయం, హనుమాన్ గర్హి ఆలయ దర్శనం కల్పిస్తారు. సరయూ నది హారతిని వీక్షించిన తర్వాత ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమాన్ని సందర్శించి పుణ్యస్నానాలు ఆచరించవచ్చు. యాత్ర పూర్తయిన అనంతరం ప్రత్యేక రైలు తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ప్యాకేజీ ధరలు ఇలా..
ఈ యాత్రకు సంబంధించి ఐఆర్సీటీసీ మూడు విభాగాల్లో ప్యాకేజీ ధరలను నిర్ణయించింది.
- ఎకానమీ (స్లీపర్): పెద్దలకు రూ.17,000, 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు రూ.15,800.
- స్టాండర్డ్ (3AC): పెద్దలకు రూ.26,400, పిల్లలకు రూ.25,000.
- కంఫర్ట్ (2AC): పెద్దలకు రూ.34,400, పిల్లలకు రూ.32,700.
ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణం, స్థానికంగా రవాణా సదుపాయం, వసతి, ఉదయం అల్పాహారం, భోజనం, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. ఆసక్తి ఉన్న భక్తులు ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.




