
హైదరాబాద్‌లో వేగంగా పెరుగుతున్న నిర్మాణాలు, తగ్గిపోతున్న పచ్చదనం నగరంలో భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయని పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధకుల ఉపగ్రహ అధ్యయనం వెల్లడించింది. 2001 నుంచి 2021 మధ్య నగరంలో నిర్మాణ ప్రాంతాలు 34 శాతం పెరగ్గా, హరిత ప్రాంతాలు 42 శాతం తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్‌లోని పారిశ్రామిక ప్రాంతం ప్రధాన హీట్ స్పాట్‌గా మారినట్లు పేర్కొన్నారు. మరోవైపు, హుస్సేన్‌సాగర్, మూసీ నది పరివాహక ప్రాంతం, మీరాలం చెరువు పరిసరాలు నగరానికి చల్లదనాన్ని అందించే ప్రాంతాలుగా గుర్తించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు నగరంలో పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు, జలవనరులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.
హైదరాబాద్‌లో వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ నగర పచ్చదనాన్ని క్రమంగా తగ్గిస్తూ, భూ ఉపరితల ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవుతోందని పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధకుల ఉపగ్రహ అధ్యయనం వెల్లడించింది. 2001 నుంచి 2021 మధ్య నగరంలో నిర్మాణ రంగం గణనీయంగా విస్తరించగా, హరిత ప్రాంతాలు భారీగా క్షీణించినట్లు పరిశోధకులు గుర్తించారు. భూ వినియోగంలో చోటుచేసుకున్న ఈ మార్పుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో వేడి తీవ్రత పెరుగుతోందని పేర్కొన్నారు. *డిస్కవర్ ఎర్త్ అబ్జర్వేషన్ జర్నల్*లో ప్రచురితమైన ఈ అధ్యయనం ఉపగ్రహ చిత్రాల ఆధారంగా హైదరాబాద్‌లో రెండు దశాబ్దాల కాలంలో భూ వినియోగంలో వచ్చిన మార్పులను, వాటి పర్యావరణ ప్రభావాలను విశ్లేషించింది.
అధ్యయనం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. పరిశీలన పరిధిలోని నిర్మిత భూభాగం 2001లో 96 చదరపు కిలోమీటర్లుగా ఉండగా, 2021 నాటికి 128 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. దీంతో నిర్మాణ ప్రాంతాల్లో సుమారు 34 శాతం వృద్ధి నమోదైంది. మరోవైపు, పట్టణ హరిత ప్రాంతాలు 47 చదరపు కిలోమీటర్ల నుంచి 27 చదరపు కిలోమీటర్లకు తగ్గిపోయాయి. అంటే దాదాపు 42 శాతం పచ్చదనం కనుమరుగైంది. జలవనరుల్లోని జలవృక్ష సంపద సైతం 19 చదరపు కిలోమీటర్ల నుంచి 8.4 చదరపు కిలోమీటర్లకు పడిపోయింది. ఇక నీటి వనరుల విస్తీర్ణం 5 చదరపు కిలోమీటర్ల నుంచి 4.6 చదరపు కిలోమీటర్లకు తగ్గినట్లు అధ్యయనం గుర్తించింది.
2021లో సేకరించిన ఉపగ్రహ చిత్రాల విశ్లేషణలో నిర్మిత ప్రాంతాల్లో సగటు భూ ఉపరితల ఉష్ణోగ్రత 34.47 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. బహిరంగ ప్రదేశాల్లోనూ దాదాపు ఇదే స్థాయిలో 34.46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, నీటి వనరుల పరిసరాల్లో మాత్రం 28.66 డిగ్రీలుగా నమోదైంది. ఈ గణాంకాలు నగరంలో ఉష్ణోగ్రతల నియంత్రణకు జలవనరులు ఎంతగానో దోహదపడుతున్నాయని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా హుస్సేన్‌సాగర్, మూసీ నది పరివాహక ప్రాంతం, మీరాలం చెరువు పరిసరాలను నగరానికి చల్లదనాన్ని అందించే కీలక ప్రాంతాలుగా పరిశోధకులు గుర్తించారు.
నగరంలో వేడి తీవ్రత ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల స్వరూపం కూడా కాలక్రమేణా మారినట్లు అధ్యయనం వెల్లడించింది. 2001లో బేగంపేట విమానాశ్రయ పరిసరాలు, తిరుమలగిరి ప్రాంతాలు ప్రధాన హీట్ స్పాట్లుగా ఉండగా.. 2021 నాటికి పశ్చిమ హైదరాబాద్‌లోని పారిశ్రామిక ప్రాంతాలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలుగా మారాయి. ఉత్తర హైదరాబాద్‌లోనూ వేడి ప్రభావం పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. అధ్యయనంలో గుర్తించిన హీట్ స్పాట్ ప్రాంతాల్లో ఏకంగా 89.4 శాతం నిర్మాణ భూభాగమే ఉండటం గమనార్హం. గోల్కొండ పరిసరాలతో పాటు నైరుతి హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా క్రమంగా ప్రధాన హీట్ స్పాట్లుగా మారుతున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.
ఈ అధ్యయనం కోసం 2001 మే 30, 2011 ఏప్రిల్ 21, 2021 మే 2 తేదీల్లో తీసిన ల్యాండ్సాట్ ఉపగ్రహ చిత్రాలను పరిశోధకులు విశ్లేషించారు. భూ వినియోగంలో వచ్చిన మార్పులను గుర్తించేందుకు మెషిన్ లెర్నింగ్ పద్ధతులను, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలను గుర్తించేందుకు గణాంక విశ్లేషణను వినియోగించారు. అలాగే, 2025 నాటి ఉపగ్రహ చిత్రాల ఆధారంగా నాలుగు ప్రాంతాలను ప్రత్యేకంగా పరిశీలించారు. 2001లో వృక్షసంపద అధికంగా ఉండి చల్లదనాన్ని అందించిన ప్రాంతాల్లో కేవలం 12.3 శాతం మాత్రమే 2021 నాటికి కూడా అదే లక్షణాన్ని కొనసాగించినట్లు అధ్యయనం వెల్లడించింది. నగరంలో పచ్చదనం తగ్గిపోతే చల్లదనాన్ని అందించే ప్రాంతాలు కూడా ఎలా కనుమరుగవుతాయో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.




