గుంటూరు మిర్చికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ.. ఇటీవల ఎగుమతుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రసాయన అవశేషాలు, అఫ్లాటాక్సిన్‌, అధిక తేమశాతం వంటి కారణాలతో చైనా, శ్రీలంక వంటి దేశాలు మన మిర్చి కంటైనర్లను తిరస్కరించి వెనక్కి పంపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రసాయనాల వినియోగాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ పద్ధతులతో నాణ్యమైన మిర్చిని పండించాలని లాంఫామ్‌ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పురుగులు, తెగుళ్లను తొలిదశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని చెబుతున్నారు.

లింగాకర్షక బుట్టలు, పక్షి స్థావరాలు ఏర్పాటు చేయడంతో పాటు బంతి, ఆముదం వంటి ఎర పంటలను సాగు చేయడం ద్వారా చీడపీడలను నియంత్రించవచ్చని సూచిస్తున్నారు. రసాయనాలు తప్పనిసరిగా వాడాల్సి వస్తే.. ఎగుమతి ప్రమాణాలకు అనుగుణమైన సురక్షిత రసాయనాలను మాత్రమే ఉపయోగించాలని చెబుతున్నారు.

పంట కోతకు కనీసం 25 రోజుల ముందు రసాయనాల వినియోగాన్ని నిలిపివేయాలని, మిరపకాయలను పూర్తిగా ఎండబెట్టిన తర్వాతే మార్కెట్‌కు తరలించాలని సూచిస్తున్నారు. కోల్డ్‌ స్టోరేజ్‌లో నిల్వ చేసేటప్పుడు తేమ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

భారత మిరపకు చైనా, బంగ్లాదేశ్‌, శ్రీలంక, సింగపూర్‌, మలేషియా, మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. ఆయా దేశాలు ఆహార ప్రమాణాలను కఠినతరం చేస్తున్న నేపథ్యంలో.. రసాయనాల వినియోగాన్ని నియంత్రించి నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తే గుంటూరు మిర్చికి విదేశీ మార్కెట్లలో మళ్లీ డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది.

మిర్చి ఎగుమతుల్లో రసాయనాల నియంత్రణపై మీ అభిప్రాయాలను కామెంట్‌ బాక్స్‌లో తెలియజేయండి.

By Ramya