హైదరాబాద్ నుంచి గోదావరి ప్రాంతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ నాలుగు రోజుల యాత్రలో ద్రాక్షారామం, అన్నవరం, అంతర్వేది, ఐనవిల్లి, అప్పనపల్లి వంటి ప్రసిద్ధ ఆలయాలను సందర్శించే అవకాశం ఉంటుంది. పుణ్యక్షేత్రాల దర్శనంతో పాటు రైలు ప్రయాణం, హోటల్ వసతి, స్థానిక రవాణా వంటి సదుపాయాలను ప్యాకేజీలో భాగంగా అందిస్తున్నారు.

IRCTC Godavari Temple Tour Telugu: గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒకే యాత్రలో దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ యాత్రలో ద్రాక్షారామం, అన్నవరం, అంతర్వేది, ఐనవిల్లి వంటి ప్రసిద్ధ ఆలయాలను సందర్శించే అవకాశం ఉంటుంది. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామంలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి విశేష ప్రాధాన్యత ఉంది. ‘ద్రాక్షారామం’ అనే పేరు దక్ష ప్రజాపతితో ముడిపడి ఉందనే పురాణ విశ్వాసం కూడా ఉంది.
గోదావరి టెంపుల్ టూర్ ప్యాకేజీ
ఈ ప్యాకేజీని SHR029 పేరుతో అందిస్తున్నారు. యాత్రలో రాజమండ్రి, అన్నవరం, అంతర్వేది ప్రధాన గమ్యస్థానాలుగా ఉన్నాయి. రైలు ప్రయాణంతో పాటు స్థానికంగా ఏసీ వాహనంలో ఆలయ దర్శనాలు ఏర్పాటు చేశారు. ఈ టూర్ ప్రతి శుక్రవారం ప్రారంభమవుతుంది. లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 8:30 గంటలకు గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం మొదలవుతుంది.
రైలు ప్రయాణం అనంతరం శనివారం తెల్లవారుజామున 4:38 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. అక్కడ హోటల్లో ఫ్రెష్అప్ అనంతరం అన్నవరం శ్రీ సత్యదేవుని దర్శనానికి బయలుదేరుతారు. అనంతరం రాజమండ్రికి తిరిగి వచ్చి గోదావరి ఘాట్, ఇస్కాన్ ఆలయం వంటి ప్రదేశాలను సందర్శిస్తారు.
మూడో రోజు యాత్రలో భాగంగా అంతర్వేదికి చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం అక్కడి బీచ్‌ను సందర్శించి, అప్పనపల్లిలోని శ్రీ బాల బాలాజీ ఆలయం, ఐనవిల్లిలోని శ్రీ విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శిస్తారు. సాయంత్రం ద్రాక్షారామం చేరుకుని శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసుకుంటారు. అనంతరం రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. సోమవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ చేరుకున్న తర్వాత లింగంపల్లికి ప్రయాణం కొనసాగుతుంది.
ప్యాకేజీ ధరలు
1 నుంచి 3 మంది ప్రయాణికులకు 3AC కంఫర్ట్ ప్యాకేజీలో సింగిల్ షేరింగ్ రూ.15,400, ట్విన్ షేరింగ్ రూ.8,990, ట్రిపుల్ షేరింగ్ రూ.7,230 నుంచి అందుబాటులో ఉంది. స్లీపర్ క్లాస్ స్టాండర్డ్ ప్యాకేజీ ధర రూ.13,840 నుంచి ప్రారంభమవుతుంది. పిల్లలకు ప్రత్యేక ఛార్జీలు వర్తిస్తాయి. 4 నుంచి 6 మంది కలిసి బుక్ చేసుకుంటే ప్యాకేజీ ధరలు మరింత తక్కువగా ఉంటాయి.
ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణం, రాజమండ్రిలో హోటల్ వసతి, ఏసీ వాహన సౌకర్యం, ఆలయ దర్శనాలు, టోల్, పార్కింగ్, జీఎస్టీ తదితరాలు ఉంటాయి. అయితే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, రైలులో ఆహారం, ఆలయ ప్రవేశ టికెట్లు, బోటింగ్ వంటి వ్యక్తిగత లేదా అదనపు ఖర్చులు ప్యాకేజీలో ఉండవు. రాజమండ్రిలో విష్ణు గ్రాండ్ లేదా అదే స్థాయి హోటల్లో వసతి కల్పిస్తారు.
ప్రయాణ టికెట్లు సాధారణంగా యాత్రకు నాలుగు రోజుల ముందు జారీ చేస్తారు. బెర్త్ కేటాయింపు సెంట్రలైజ్డ్ PRS విధానంలో జరుగుతుంది. హోటల్ చెక్-ఇన్ సమయం మధ్యాహ్నం 12 గంటలు కాగా, ముందస్తు చెక్-ఇన్ గదుల లభ్యతను బట్టి ఉంటుంది. ప్యాకేజీ ధరలు, రైలు సమయాలు, హోటల్, యాత్ర షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కాబట్టి బుకింగ్‌కు ముందు సంబంధిత టూర్ ఆపరేటర్ వద్ద తాజా వివరాలను నిర్ధారించుకోవడం మంచిది.
