
గత ఏడాది పహల్గాంలో పర్యాటకులపై దాడి చేసి 26 మంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులు.. మరో కుట్రకు సిద్ధమయ్యారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పహల్గాం దాడికి సంబంధించి కీలక అనుమానితుడిగా భావిస్తున్న పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది హషిం మూసాను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. బుధవారం జరిగిన ఈ ఆపరేషన్ అనంతరం అతడి మృతదేహంతో పాటు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
పహల్గాం ఉగ్రదాడి ప్రస్తావన రాగానే.. ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది బాధితులు, ఆ తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గుర్తుకొస్తాయి. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలపై భారత్ తీసుకున్న చర్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
ఇప్పుడు పహల్గాం దాడికి సంబంధించి కీలక అనుమానితుడిగా భావిస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాది మహమ్మద్ ఆసిఫ్ అలియాస్ హషిం మూసా హతమయ్యాడు. కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో అతడిని మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం జరిగిన ఈ ఆపరేషన్ అనంతరం అతడి మృతదేహంతో పాటు భారీగా ఆయుధాలు, యుద్ధ సామగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో.. ఆర్మీతో పాటు ఇతర భద్రతా బలగాలు బుధవారం యూస్మార్గ్ ప్రాంతంలో ‘ఆపరేషన్ కోరగ్’ను ప్రారంభించాయి. అనుమానాస్పద కదలికలను గుర్తించిన అధికారులు.. వెంటనే సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో.. సైన్యం ఎదురుకాల్పులు జరిపింది. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా ఉగ్రవాది హషీం మూసా హతమైనట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి.
2025లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించి ప్రధాన అనుమానితుల్లో హషీమ్ మూసా ఒకడిగా భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. దాడి అనంతరం అప్రమత్తమైన కాశ్మీర్ పోలీసులు.. మూసాతో పాటు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు అదిల్ హుస్సేన్, అలీ భాయ్ గురించి సమాచారం అందించిన వారికి రూ.20 లక్షల రివార్డును ప్రకటించారు.
భద్రతా వర్గాల సమాచారం ప్రకారం.. హషీమ్ మూసా గతంలో పాకిస్థాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్‌లో పారా కమాండోగా పనిచేసినట్లు తెలుస్తోంది.
పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దాఖలు చేసిన ఛార్జిషీట్లో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా, ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందిన ఏడుగురు ఉగ్రవాదుల పేర్లను చేర్చింది. మొత్తం 1,597 పేజీలతో కూడిన ఈ ఛార్జిషీట్లో.. ఉగ్రదాడి కుట్రలో పాకిస్థాన్ ప్రమేయానికి సంబంధించిన పలు వివరాలను ఎన్ఐఏ వెల్లడించింది.
లష్కరే తోయిబా, ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందిన ఉగ్రవాదులు పహల్గాం దాడిని ఎలా పథకం రచించారు, దానిని ఎలా అమలు చేశారనే అంశాలను కూడా ఛార్జిషీట్లో వివరించినట్లు తెలుస్తోంది. అలాగే పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్, ఉగ్రవాది సాజిద్ జాట్ పేరును కూడా ఎన్ఐఏ తన ఛార్జిషీట్లో ప్రస్తావించింది.
