
పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో ప్రభావం రుతుపవనాలపై తీవ్రంగా పడింది. ఫలితంగా ఈ వర్షాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదై, పలు రాష్ట్రాలు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. రాష్ట్రంలో మొత్తం 358 తాలూకాలు ఉండగా, ఏకంగా 265 తాలూకాల్లో వర్షపాతం గణనీయంగా లేకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఇలాంటి కరువు పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రజలు తాగునీరు, సాగునీటి కోసం అల్లాడుతుండగా.. లోకాయుక్త కార్యాలయానికి విలాసవంతమైన కార్ల కొనుగోలు కోసం ఏకంగా రూ.1.32 కోట్లను కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. కరువు సమయంలో ప్రజల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇలాంటి ఖర్చులకు నిధులు కేటాయించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మహారాష్ట్రలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో లోకాయుక్త సభ్యుల కోసం రూ.1.32 కోట్ల విలువైన లగ్జరీ వాహనాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది.
లోకాయుక్తలోని నలుగురు సభ్యుల కోసం ఒక్కో వాహనానికి రూ.33 లక్షల చొప్పున బడ్జెట్ కేటాయిస్తూ నాలుగు టయోటా ఇన్నోవా హైక్రాస్ (ZX-7S) కార్ల కొనుగోలుకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ అనుమతి ఇచ్చింది. ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన లోకాయుక్త సభ్యులకు ఈ వాహనాలను కేటాయించనున్నారు.
మాజీ న్యాయమూర్తి జస్టిస్ సునీల్ శుక్రే నేతృత్వంలోని ప్యానెల్లో మాజీ న్యాయమూర్తులు సురేంద్ర తావ్డే, సువర్ణ కేవలే, మాజీ డీజీపీ రష్మి శుక్లా, మాజీ ఐఏఎస్ అధికారి ఓం ప్రకాష్ గుప్తా సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇదిలా ఉండగా, మహారాష్ట్రలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని 358 తాలుకాల్లో 265 తాలుకాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన సమయంలో ఇంత భారీ మొత్తాన్ని ఖరీదైన వాహనాల కోసం ఖర్చు చేయడంపై ప్రజలు, రాజకీయ వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజాధనాన్ని పొదుపుగా వినియోగించాలని రాష్ట్ర మంత్రులు సూచిస్తున్న సమయంలోనే ఈ నిర్ణయం వెలువడటం మరింత చర్చకు దారితీసింది. కరువు వంటి సంక్షోభ పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యయ ప్రాధాన్యతలపై ఈ వ్యవహారం మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.
శాలువాలు, పూలదండలతో సత్కారాలు చేయవద్దని, సమావేశాల్లో జీడిపప్పు, బాదం, పిస్తా వంటి డ్రైఫ్రూట్స్కు బదులుగా సాధారణ భోజనం మాత్రమే ఏర్పాటు చేయాలని మంత్రి ఉదయ్ సామంత్ అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో, కష్టకాలంలో అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ రైతులకు బహిరంగంగా విజ్ఞప్తి చేశారు.
అయితే, మరోవైపు లోకాయుక్త సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తైన వెంటనే లోకాయుక్త కార్యాలయానికి వాహనాల కొనుగోలు కోసం సాధారణ పరిపాలన శాఖ నుంచి ముందస్తు అనుమతి లభించడం, అనంతరం నిధుల మంజూరుకు ప్రభుత్వం ఉత్తర్వులు (GR) జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న వేళ రైతులు, సామాన్య ప్రజలు పొదుపు పాటించాలని సూచిస్తున్న ప్రభుత్వం.. అదే సమయంలో లోకాయుక్త కార్యాలయం కోసం ఖరీదైన వాహనాల కొనుగోలుకు నిధులు మంజూరు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రజలకు పొదుపు పాటించాలని సూచిస్తూ, ప్రభుత్వ వ్యవహారాల్లో మాత్రం ఇలాంటి ఖర్చులకు అనుమతులు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
