D-News: సెక్షన్ 22A నిషేధిత భూముల జాబితాలో ఉన్న అర్హత కలిగిన నివాస స్థలాలను తొలగించిన అనంతరం.. వాటి యజమానులకు కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అధికారిక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భూముల యాజమాన్యానికి సంబంధించిన పత్రాలు, క్లియరెన్స్ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ NOCలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ.. చట్టబద్ధంగా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్న భూములను సెక్షన్ 22A నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని తెలిపారు. భూములపై హక్కులు ఉన్నప్పటికీ వాటిని అమ్ముకోవడం, బ్యాంకు రుణాలకు తనఖా పెట్టడం, రిజిస్ట్రేషన్ చేయించడం వంటి అవకాశాలు లేకపోవడంతో ప్రజలు ఆర్థికంగా, మానసికంగా నష్టపోయారని పేర్కొన్నారు.
22A నుంచి తొలగింపుతో హక్కుల పునరుద్ధరణ
కూటమి ప్రభుత్వం చేపట్టిన క్రమబద్ధమైన పరిశీలన, ధృవీకరణ ప్రక్రియ ద్వారా అర్హత కలిగిన ప్రైవేట్ భూములను 22A జాబితా నుంచి తొలగిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీంతో సంబంధిత భూముల యజమానులకు తమ ఆస్తులపై ఉన్న చట్టపరమైన హక్కులు తిరిగి పూర్తిగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
22A ఆంక్షలు తొలగిన తర్వాత భూమి యజమానులు బ్యాంకుల నుంచి రుణాలు పొందడం, తమ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టడం, ఆస్తులను విక్రయించడం, వారసులకు బదలాయించడం, టైటిల్ ట్రాన్స్ఫర్ వంటి పనులను గతంలో ఉన్న పరిపాలనా అడ్డంకులు లేకుండా చేసుకునే అవకాశం ఉంటుంది.
ఈ చర్యతో 22A జాబితాలో అనవసరంగా చేరిన ప్రైవేట్ భూముల యజమానులకు ఉపశమనం లభించడంతో పాటు, ఆస్తి హక్కుల విషయంలో స్పష్టత ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన డీలిస్టింగ్ ప్రక్రియ ద్వారా అర్హులైన ఆస్తి యజమానులకు తమ భూములపై పూర్తి హక్కులను వినియోగించుకునే అవకాశం కలుగుతోంది.
