కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీలు) నియామకానికి సంబంధించిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా 2023లో తీసుకొచ్చిన చట్టంలోని నిబంధనలపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సీఈసీ, ఈసీల ఎంపిక ప్యానల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని తప్పించి, ఆయన స్థానంలో ప్రధానమంత్రి నామినేట్ చేసే కేంద్ర మంత్రిని చేర్చడంపై కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది.

ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేయాలా వద్దా అనే విషయంలో న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా, క్రికెట్ జట్టుకు ఎంపైర్‌ను ఆ జట్టే ఎంపిక చేసుకున్నట్టుగా ఈ నియామక ప్రక్రియ ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీలు) ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి, ఆయన స్థానంలో కేంద్ర మంత్రిని నియమిస్తూ 2023లో తీసుకొచ్చిన చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మల ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా క్రికెట్‌ను ఉదాహరణగా తీసుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్యాటింగ్‌ చేసే జట్టే అంపైర్‌ను ఎంపిక చేస్తే, ఆ అంపైర్‌ ఎంత నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ అతడిపై అనుమానాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

2023 ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం కేంద్ర ప్రభుత్వ ప్రభావం నుంచి ఎన్నికల సంఘాన్ని పూర్తిగా దూరంగా ఉంచడం లేదన్న అభిప్రాయాన్ని ధర్మాసనం ప్రాథమికంగా వ్యక్తం చేసింది. ‘‘బ్యాటింగ్‌ జట్టు ఎంపిక చేసిన అంపైర్‌ సరైన నిర్ణయం తీసుకున్నా.. అతడిపై అనుమానాలు కొనసాగుతాయి. ఎందుకంటే అతడు ఆ జట్టుకు విధేయుడిగా భావించే అవకాశం ఉంటుంది’’ అని జస్టిస్‌ దత్తా పేర్కొన్నారు.

న్యాయపరమైన అంశాన్ని వివరించేందుకు జస్టిస్‌ దత్తా ఉపయోగించిన ఈ క్రికెట్‌ ఉపమానం ఆసక్తిని రేకెత్తించింది. అదే సమయంలో ఆయనకు క్రీడలపై ఉన్న ఆసక్తిని కూడా ఈ వ్యాఖ్య ప్రతిబింబించింది.

ప్రధాని, ప్రధాని నామినేట్ చేసిన కేంద్ర మంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండే కమిటీలో ప్రభుత్వానికి 2:1 ఆధిక్యం ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రధాని నామినేట్ చేసిన మంత్రి తన నేత నిర్ణయాలను వ్యతిరేకించే పరిస్థితి ఉండదని, సామూహిక బాధ్యత (Collective Responsibility) సిద్ధాంతం కూడా అందుకు అనుమతించదని పేర్కొంది. దీంతో కమిటీలో ప్రతిపక్ష నేత సభ్యత్వం కేవలం అలంకారప్రాయంగా మారే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది.

సీజేఐ స్థానంలో కేంద్ర మంత్రిని చేర్చుతూ మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.

‘‘స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు నిజమైన స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘంపై ఆధారపడి ఉంటాయి. ఎన్నికల సంఘం స్వతంత్రంగా ఉండటం మాత్రమే కాదు, అది స్వతంత్రంగా కనిపించడం కూడా అంతే ముఖ్యం’’ అని జస్టిస్ దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించారు.