
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పలు ప్రాంతాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
బుధవారం రాష్ట్రంలోని 14 జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని చెప్పారు. అలాగే శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడవచ్చని వివరించారు.
మరోవైపు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లా కొండాపురంలో అత్యధికంగా 39.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో 34.4 మి.మీ., కావలిలో 34.2 మి.మీ., మారెళ్లలో 33.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. త్రిపురాంతకంలో 27.9 మి.మీ., నెల్లూరులో 27.5 మి.మీ., ములుకుదురులో 26 మి.మీ. వర్షం కురిసినట్లు విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద నిలబడకూడదని, ఈదురుగాలులు వీచే సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.




