
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై మంత్రి నారా లోకేశ్ స్పష్టత ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక అని పేర్కొన్న లోకేశ్.. వారి రిజర్వేషన్ల విషయంలో వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు.
కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం కొత్త అంశం కాదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలయ్యాయి. అయితే మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో.. గత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించింది.
ప్రస్తుతం బీసీలకు తిరిగి 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో తమ ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
ఏపీ మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సత్తా చాటేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.
బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేయకముందే అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారని వైసీపీని లోకేశ్ ప్రశ్నించారు. నెల్లూరు మేయర్ అభ్యర్థిని వైసీపీ ప్రకటించడాన్ని ఆయన అవగాహన రాహిత్యంగా అభివర్ణించారు. బడుగు, బలహీన వర్గాలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక అని పేర్కొన్నారు.
ఈ నెలలోనే స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం?
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్‌లోనే జరిగే అవకాశం ఉందని నారా లోకేశ్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా దృష్టి సారిస్తామని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించిందని లోకేశ్ ఆరోపించారు. బీసీలకు దక్కాల్సిన రాజకీయ ప్రాధాన్యతను దూరం చేసేందుకు వైసీపీ పెద్ద కుట్ర చేస్తోందని విమర్శించారు. బీసీలకు న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు
ఏపీలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశం కొత్తదేమీ కాదు. గతంలో రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలయ్యాయి. 1994లో స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తీసుకురాగా.. ఆ తర్వాత 1995, 2001, 2006, 2013లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఈ రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి.
అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పించే మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ అంశంలో కీలక మలుపుగా మారింది. దీంతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించిన అనంతరం.. మిగిలిన పరిమితికి అనుగుణంగా బీసీ రిజర్వేషన్లను నిర్ణయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారు. 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని దాటకూడదన్న న్యాయపరమైన నిబంధనల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే రిజర్వేషన్ల తగ్గింపుతో స్థానిక సంస్థల్లో బీసీలకు దక్కాల్సిన వేలాది పదవులు దూరమయ్యాయని విమర్శలు వెల్లువెత్తాయి.
అప్పటి నుంచి 34 శాతం బీసీ రిజర్వేషన్ల అంశం ఏపీ రాజకీయాల్లో కీలక చర్చగా మారింది. తాజాగా కూటమి ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు తిరిగి 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించడంతో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అయితే 34 శాతం రిజర్వేషన్ల అమలుపై న్యాయపరమైన అంశాలు కొనసాగుతుండటంతో.. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది.
