
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్‌కు సంబంధించిన వార్తలు, వివరాలను సోషల్ మీడియా, టీవీ ఛానళ్లతో పాటు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ప్రచురించకూడదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తన కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించేలా కొన్ని సోషల్ మీడియా వేదికలు, టీవీ ఛానళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయని ఆరోపిస్తూ భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, సంబంధిత అంశాల ప్రచురణ, ప్రసారాలపై మధ్యంతర ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌కు సంబంధించిన కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భగీరథ్ కేసు వివరాలు, సమాచారాన్ని టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా వేదికలపై ప్రచారం చేయవద్దని ఆదేశించింది.
తనకు బెయిల్ లభించినప్పటికీ, కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించేలా కొన్ని టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా వేదికల్లో కథనాలు ప్రసారం చేస్తున్నారని పేర్కొంటూ భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఈవీ వేణుగోపాల్ విచారణ చేపట్టారు.
భగీరథ్ తరఫున న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. ప్రైవేట్ ఫంక్షన్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పోక్సో కేసుతో ముడిపెట్టి, భగీరథ్ వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా కంటెంట్ రూపొందిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు విచారణలో ఉన్న కేసుపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు.
భగీరథ్ ఫొటోలు, వీడియోలతో కూడిన అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించేలా గూగుల్, మెటా, ఎక్స్ సంస్థలకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు
పూర్తి వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి కీలక ఆదేశాలు జారీ చేశారు. పోక్సో కేసుకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ప్రచురించకూడదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన సమాచారం, కంటెంట్ ప్రచురితమై ఉంటే వాటిని తొలగించాలని ఆదేశించారు.
ఈ వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా సంస్థలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు సంబంధించి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
