
పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వదినం సిక్కు మత గురువు గురునానక్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రెండు పండుగల విశిష్టతను వివరిస్తూ సందేశాలు పోస్ట్ చేశారు.
కార్తీక పౌర్ణమి శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన పర్వదినమని లోకేశ్ పేర్కొన్నారు. ఈ పవిత్రమైన రోజు ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.
అలాగే గురునానక్ జయంతి సందర్భంగా సిక్కు సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గురునానక్ బోధించిన సత్యం, అహింస, మత సామరస్యం నిస్వార్థ సేవా భావం ఎప్పటికీ ఆచరణీయమని పేర్కొన్నారు. తోటి మనిషికి సేవ చేయాలనే ఆయన సందేశాలు సమాజానికి నిరంతరం మార్గదర్శకంగా నిలుస్తాయని మంత్రి నారా లోకేశ్ తన పోస్టులో వెల్లడించారు.




