
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే భక్తులు నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి మహాదేవుడిని దర్శించుకుంటున్నారు. ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎక్కడ చూసినా శివనామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని వశిష్ట గోదావరి తీరానికి కార్తీక పౌర్ణమి స్నానాల కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే వలందర్ స్నానాల ఘాట్ భక్తులతో నిండిపోయింది. భక్తులు పవిత్ర గోదావరిలో స్నానాలు ఆచరించి నదిలో కార్తీక దీపాలను వదిలి మొక్కులు తీర్చుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలోనూ భక్తుల రద్దీ నెలకొంది. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు నదిలో కార్తీక దీపాలను వదిలారు. మరోవైపు వివిధ శైవక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కృష్ణా నది తీరంలోనూ భక్తుల సందడి నెలకొంది.
నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము మూడు గంటల నుంచే ఆలయాల వద్ద బారులు తీరారు. హర హర మహాదేవ ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రాలతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి. కార్తీక దామోదరుడికి పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, మహారుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా సాయంత్రం కోటి దీపోత్సవం నిర్వహించనున్నారు. శ్రీశైలం క్షేత్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని గంగాధర మండపం వద్ద సాయంత్రం జ్వాలాతోరణ మహోత్సవం జరగనుంది. పుష్కరిణిలో లక్ష దీపోత్సవంతో పాటు పుష్కరిణి హారతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
మహానంది క్షేత్రంలోనూ కార్తీక కోటి దీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 6.30 గంటలకు రాజగోపురం ఎదుట జ్వాలాతోరణం వేడుక నిర్వహించనున్నారు. అనంతరం కోటి దీపోత్సవ కార్యక్రమం జరగనుంది. ఆలయ ప్రాంగణం కోటి దీపాల కాంతులతో ప్రకాశించనుంది. కార్తీక పౌర్ణమి వేడుకల నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ భక్తజన సందోహంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.




