ఆంధ్రప్రదేశ్‌లో బౌద్ధ పర్యాటకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక ప్రతిపాదనలు చేశారు. థాయ్‌లాండ్ సహకారంతో రాష్ట్రంలో బౌద్ధ పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్‌లో భారతదేశంలోని థాయ్‌లాండ్ రాయబారి చవనార్ట్ థాంగుసుమ్‌ఫంట్‌తో సమావేశమై పర్యాటక, విద్యా రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు.

అమరావతిలోని మహాచైత్య స్థూపాన్ని కేంద్రంగా చేసుకుని నాగార్జునకొండ, తొట్లకొండ, బావికొండ వంటి చారిత్రక బౌద్ధ క్షేత్రాలను అనుసంధానిస్తూ ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయాలని లోకేశ్ ప్రతిపాదించారు. దీనివల్ల విదేశీ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు రాష్ట్ర బౌద్ధ వారసత్వానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.

అమరావతిలో థాయ్ సాంస్కృతిక కేంద్రం ఏర్పాటుకు థాయ్‌లాండ్ భాగస్వామ్యం కావాలని కోరారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బౌద్ధ అధ్యయన కేంద్రం ఏర్పాటుకు థాయ్‌లాండ్ విశ్వవిద్యాలయాలు, సంస్థలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల బౌద్ధ తత్వశాస్త్రం, చరిత్ర, పరిశోధనలకు ప్రోత్సాహం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

విశాఖ–థాయ్‌లాండ్ మధ్య క్రూయిజ్ పర్యాటకం

విశాఖపట్నం నుంచి థాయ్‌లాండ్‌కు క్రూయిజ్ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని లోకేశ్ ప్రతిపాదించారు. ఇరు ప్రాంతాల మధ్య విమాన కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని సూచించారు. ఈ ప్రతిపాదనల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగానికి అంతర్జాతీయ అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *