విజయవాడలోని సింగ్‌నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం లక్షలాది మంది త్యాగాల ఫలితమని గుర్తుచేశారు. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహనీయుల పోరాట స్ఫూర్తిని స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
కులం, మతం అనే భేదాలు లేని ఏకైక జాతీయ పండుగ జెండా పండుగ అని పేర్కొంటూ.. దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని సందేశం ఇచ్చారు.
జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్యకు చెందిన ప్రాంతంలో స్వాతంత్ర్య వేడుకల్లో జెండాను ఆవిష్కరించడం తనకు గర్వకారణమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

