
న్యూఢిల్లీ, ఆగస్టు 16: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు జరిగిన సమావేశాల్లో పలు కీలక బిల్లులను ఆమోదింపజేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ, విపక్షాల నిరసనలతో ఆశించిన స్థాయిలో సభా కార్యక్రమాలు సాగలేదు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా దాదాపు మొత్తం సమావేశాలకు దూరంగా ఉన్నారు. చివరి రోజు మాత్రమే సభకు హాజరయ్యారు. ప్రధాని మోదీ, అమిత్ షాలు సభకు హాజరుకాకపోవడంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి.
డీలిమిటేషన్తో ముడిపడిన మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు పలు కీలక అంశాలపై ముందడుగు పడలేదు. ఫారిన్ కాంట్రిబ్యూషన్ బిల్లును కూడా విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపారు.
మరోవైపు విద్యార్థుల ఆందోళనలు, విపక్షాల నిరసనలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. మొత్తంగా కీలక బిల్లులను ఆమోదింపజేయాలని భావించిన అధికార పక్షానికి వర్షాకాల సమావేశాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

