
జనసేన పార్టీ ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ కొణిదెల నాగబాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్పర్సన్గా నాగబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవికి ఆయనకు కేబినెట్ ర్యాంకు హోదా కల్పించింది.
రాష్ట్రంలో పచ్చదనం పెంపు, అటవీ పునరుద్ధరణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా ఏపీ గ్రీన్ సొసైటీని ఏర్పాటు చేశారు. 2047 నాటికి రాష్ట్రంలో 50 శాతం ఫారెస్ట్, ట్రీ కవర్ సాధించాలనే లక్ష్యంతో ఈ వ్యవస్థను రూపొందించినట్లు పర్యావరణ, అటవీ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
హరిత కార్యక్రమాల్లో కీలక పాత్ర
రాష్ట్రంలో పచ్చదనం పెంపు, అటవీ పునరుద్ధరణ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలకు గ్రీన్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సమన్వయంతో వివిధ హరిత కార్యక్రమాలను అమలు చేయనుంది.
గ్రీన్ సొసైటీ గవర్నింగ్ బోర్డు ఛైర్మన్గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహరించనున్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్పర్సన్గా నాగబాబు బాధ్యతలు చేపట్టనున్నారు. హరిత కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించడం, వివిధ సంస్థల మధ్య సమన్వయం, కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ వంటి అంశాల్లో ఈ కమిటీ కీలకంగా పనిచేయనుంది.
2019లో జనసేనలోకి నాగబాబు
కొణిదెల నాగబాబు 2019 ఎన్నికల సమయంలో జనసేన పార్టీలో చేరారు. అదే ఎన్నికల్లో నరసాపురం లోక్సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పార్టీ బలోపేతం కోసం పనిచేశారు.
2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాగబాబు ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ ఆయన ఎన్నికల బరిలోకి దిగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు రాజ్యసభ అవకాశం దక్కుతుందనే ప్రచారం కూడా సాగింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు.
గతేడాది మార్చిలో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి లభించింది. అనంతరం ఆయనకు మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరిగింది. తాజాగా ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్పర్సన్గా ప్రభుత్వం నియమించడంతో నాగబాబుకు మరో కీలక బాధ్యత దక్కినట్లయింది.

