
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అమరావతిలో నాలుగు రోజుల పాటు అసెంబ్లీతో పాటు శాసన మండలి సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
కూటమి ప్రభుత్వానికి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు హాజరుకానున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు హాజరవుతారా? లేదా? అనే అంశంపై ఆ పార్టీ నుంచి ఇంకా స్పష్టత రాలేదు.
మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలను ప్రస్తావించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి వైసీపీ ఎమ్మెల్యేలకు సూచించారు. వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరైతే డీఎస్సీతో పాటు పలు అంశాలపై మంత్రుల నుంచి సమాధానాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు.
ప్రతిపక్ష హోదాకు అవసరమైన అర్హతలు లేకుండా ఆ హోదా కల్పించడం సాధ్యం కాదని స్పీకర్ స్పష్టం చేశారు. సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

