
కొయ్యలగూడెం, : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని కొయ్యలగూడెం మండల టీడీపీ అధ్యక్షుడు పారేపల్లి రామారావు తెలిపారు.
మండలంలోని యర్రంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసేందుకు డైనింగ్ హాల్ లేక ఇబ్బందులు పడుతున్న విషయం ఎంపీ దృష్టికి వెళ్లిందన్నారు. దీనిపై వెంటనే స్పందించిన ఎంపీ.. సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి పంచాయతీరాజ్ శాఖ ద్వారా డైనింగ్ హాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించినట్లు చెప్పారు.
విద్యార్థుల సౌకర్యార్థం డైనింగ్ హాల్ నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.3 లక్షలు మంజూరు చేసినట్లు రామారావు వెల్లడించారు. పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ఎంపీ తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు.
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేస్తున్న కృషి అభినందనీయమని రామారావు పేర్కొన్నారు.
