
నక్కపల్లి: విధి నిర్వహణతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటుతున్న పాయకరావుపేట పోలీస్‌స్టేషన్ మహిళా కానిస్టేబుల్ వి. విజయను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సత్కరించారు. ఇటీవల అమరావతిలో జరిగిన రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో విజయ పలు విభాగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ఆరు స్వర్ణ పతకాలు సాధించారు.
5 వేల మీటర్లు, 1500 మీటర్లు, 800 మీటర్ల పరుగులతో పాటు 400×4 మీటర్ల రిలేలో విజయ ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే ఖోఖో, కబడ్డీ పోటీల్లో ఆమె ప్రాతినిధ్యం వహించిన జట్లు కూడా ప్రథమ స్థానంలో నిలవడంతో ఆయా విభాగాల్లోనూ విజయ స్వర్ణ పతకాలను అందుకున్నారు.
విధి నిర్వహణతోపాటు క్రీడా రంగంలోనూ రాణిస్తున్న విజయను పలువురు అభినందించారు. ఆమె ప్రతిభ పోలీసు శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు.
కానిస్టేబుల్‌తో కలిసి టిఫిన్ చేసిన హోంమంత్రి
నక్కపల్లి మండలంలోని తన నివాసం వద్ద హోంమంత్రి అనిత.. కానిస్టేబుల్ విజయతో కలిసి టిఫిన్ చేస్తూ పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆమెను ఘనంగా సత్కరించి, సాధించిన పతకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణతోపాటు క్రీడల్లోనూ రాణిస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఇదే సందర్భంగా పాయకరావుపేట పోలీస్ పరిధిలో పలు కేసుల దర్యాప్తులో కీలకంగా వ్యవహరించడంతోపాటు సాంకేతిక అంశాల్లోనూ ప్రతిభ కనబరుస్తున్న కానిస్టేబుల్ రాంబాబును హోంమంత్రి సత్కరించారు. అలాగే అవయవదానం చేసిన నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావును కూడా అభినందించారు.
