ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక మార్పు చేసింది. అక్టోబర్‌ 1న ఉదయం కాకుండా మధ్యాహ్నం నుంచి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. బ్యాంకులకు వరుస సెలవులు, ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

అక్టోబర్‌ 1న ఉదయం సచివాలయ సిబ్బంది బ్యాంకులకు వెళ్లి పింఛన్ల పంపిణీకి అవసరమైన నగదును విత్‌డ్రా చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం నుంచి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్‌ డబ్బులను అందజేస్తారు. పింఛన్‌దారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఈ నెల 26న బ్యాంకులకు సెలవు ఉండగా.. 28, 29, 30 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు వెళ్లనున్నారు. దీంతో అక్టోబర్‌ 1 ఉదయం నగదు విత్‌డ్రా చేసుకునేలా బ్యాంకులకు ఎస్‌ఎల్‌బీసీ (స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ) ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

అక్టోబర్‌ నెలకు సంబంధించి 61.80 లక్షల మంది పింఛన్‌ లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.2,692 కోట్లను విడుదల చేసింది.

ఎన్‌ఎస్‌ఏపీ పింఛన్లు బ్యాంకు ఖాతాల్లోకి

ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎస్‌ఏపీ (జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం) కింద అందించే పింఛన్‌ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేయనుంది. తొలుత విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలో పైలట్‌ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద సుమారు 62 లక్షల మంది పింఛన్‌ లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 9.34 లక్షల మంది ఎన్‌ఎస్‌ఏపీ పరిధిలో ఉన్నారు. కేంద్రం అమలు చేస్తున్న కొత్త స్పర్శ్‌ విధానానికి అనుగుణంగా వీరికి కేంద్ర వాటా కింద లభించే రూ.200 నుంచి రూ.500 వరకు మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

By Ramya