
ఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో డీఐజీ కోయా ప్రవీణ్, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి, కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌లను తక్షణమే ఎన్నికల విధుల నుంచి తొలగించాలని వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు.
ఈ మేరకు రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, డీవోపీటీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌కు ఆయన లేఖలు రాశారు. రాష్ట్రంలో అధికార కూటమి నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీ అభ్యర్థులను బెదిరిస్తూ నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని లేఖలో ఆరోపించారు.
పుంగనూరు, పులివెందుల, కమలాపురం, రాజంపేట, బద్వేలు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు జరిగాయని ఎంపీ పేర్కొన్నారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై కూడా దాడి జరిగినట్లు ఆరోపించారు.
2019 ఎన్నికల సమయంలో పక్షపాత వైఖరి ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం బదిలీ చేసిన డీఐజీ కోయా ప్రవీణ్‌ను తిరిగి ఎన్నికల విధుల్లో నియమించడం నిబంధనలకు విరుద్ధమని గురుమూర్తి పేర్కొన్నారు.
పోలీసుల పక్షపాత వైఖరి, హైకోర్టు ఆదేశాల అమలులో జరిగినట్లు ఆరోపిస్తున్న వైఫల్యాలపై సీసీటీవీ దృశ్యాల ఆధారంగా స్వతంత్ర విచారణ చేపట్టాలని ఆయన కోరారు. అలాగే వైఎస్సార్సీపీ అభ్యర్థులకు తగిన పోలీసు రక్షణ కల్పించి, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎంపీ గురుమూర్తి కోరారు.
