
జీవీఎంసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోందని ఎంపీ శ్రీభరత్ తెలిపారు. మొత్తం 120 వార్డుల్లో కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్నారని మేయర్ అభ్యర్థిగా ముక్క శ్రావణి బరిలో ఉన్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కూటమిపై అసత్య ప్రచారాలు చేస్తూ బురద జల్లుతున్నారని ఆయన విమర్శించారు.
విశాఖకు కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదని వైసీపీ చేస్తున్న ఆరోపణలను శ్రీభరత్ ఖండించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్యాకేజీ తీసుకొచ్చామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేశామని నగరంలో మూడు వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు.
పలు ఐటీ కంపెనీలు విశాఖకు వస్తున్నాయని స్టార్ హోటళ్ల ఏర్పాటుతో నగర అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని వివరించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మురికివాడల స్థానంలో గ్రూప్ హౌసింగ్ నిర్మాణాలు చేపడుతున్నట్లు శ్రీభరత్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులకు ఇళ్లు అందజేశామని చెప్పారు.
వైసీపీ హయాంలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారని మద్యం విధానంపై ఇచ్చిన హామీలకు విరుద్ధంగా నాసిరకం మద్యం సరఫరా చేశారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో 11 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని శ్రీభరత్ ఆరోపించారు. ఋషికొండను ధ్వంసం చేసిన వైసీపీ నాయకులు పర్యావరణం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. విశాఖలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
దేవస్థాన భూములను అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో తుఫాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని శ్రీభరత్ తెలిపారు. తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు మృతి చెందడం బాధాకరమని మృతుల్లో ఇద్దరు విశాఖకు చెందినవారని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లు తెలిపారు.
