
ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభివృద్ధి కలలకు ప్రధాని నరేంద్ర మోదీ కొత్త దిశ చూపారని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు అడుగుజాడల్లో నిలిచిన ఈ పవిత్ర నేలపై అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక ఘట్టమని లోకేష్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పరిశ్రమలు, పెట్టుబడులు, పర్యాటకం, ఐటీ, ఉపాధి అవకాశాల విస్తరణకు ఈ విమానాశ్రయం దోహదపడుతుందని ఆయన తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రంలో పలు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగంగా అమలవుతున్నాయని లోకేష్ అన్నారు. సహజ వనరులతో సమృద్ధిగా ఉన్న ఉత్తరాంధ్రకు ఈ విమానాశ్రయం కొత్త ఆర్థిక అవకాశాలను తీసుకురావడంతో పాటు, స్థానిక యువతకు ఉపాధి కల్పించి వలసలను తగ్గించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఒకప్పుడు “ఎర్రబస్సు కూడా రాదన్న ప్రాంతంలో” నేడు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మితమవడం గొప్ప విజయమని, అదే వేదికపై ప్రధాని మోదీ పాల్గొనడం ఉత్తరాంధ్ర ప్రజలకు గర్వకారణమని లోకేష్ వ్యాఖ్యానించారు.
అత్యంత వేగంగా భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేసిన జీఎంఆర్ సంస్థకు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి మరింత వేగం అందుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

