తమిళనాట కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి.. ప్రధాని అభ్యర్థి విజయ్‌ అంటూ టీవీకే పట్టు.. ఈనెల 9న మిత్రపక్షాలతో కీలక భేటీ

తమిళనాడు రాజకీయాల్లో టీవీకే, కాంగ్రెస్ మధ్య ప్రధాని అభ్యర్థిత్వ అంశం చిచ్చు రేపుతోంది. విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని టీవీకేకు చెందిన కొందరు నేతలు బహిరంగంగా డిమాండ్ చేస్తుండగా, కాంగ్రెస్ మాత్రం రాహుల్ గాంధీయే తమ ప్రధాని అభ్యర్థి అని తేల్చి చెబుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 9న మిత్రపక్షాలతో టీవీకే కీలక సమావేశం నిర్వహించనుంది. అయితే ప్రధాని అభ్యర్థిత్వంపై నెలకొన్న వివాదంపై విజయ్ ఇప్పటివరకు ఎలాంటి స్పందన చేయకపోవడం ఆసక్తికరంగా మారింది.

తమిళనాడు రాజకీయాల్లో అధికార తమిళగ వెట్రి కళగం (టీవీకే), కాంగ్రెస్ మధ్య విభేదాలు బహిర్గతమవుతున్న వేళ కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకోనుంది. సెప్టెంబర్ 9న టీవీకే తన మిత్రపక్షాలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి ఇప్పటికే రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.

2029 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా టీవీకే అధినేత, ముఖ్యమంత్రి విజయ్‌ను ప్రొజెక్ట్ చేయాలన్న డిమాండ్లు పార్టీలోని కొందరు నేతల నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలతో టీవీకే నిర్వహిస్తున్న సమావేశం ఎలాంటి నిర్ణయాలకు దారితీస్తుందన్న అంశంపై ఆసక్తి నెలకొంది.

టీవీకే మంత్రులు బస్సీ ఆనంద్, ఆర్ఎన్ నిర్మల్ కుమార్, రాజ్ మోహన్ తదితరులు మిత్రపక్షాలైన ఎండీఎంకే, సీపీఐ, సీపీఎం నేతలను సమావేశానికి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఎండీఎంకే అధినేత వైగో కూడా తమ పార్టీ ఈ సమావేశానికి హాజరవుతుందని ఇప్పటికే ధృవీకరించారు.

అయితే టీవీకేకు తమిళనాడులో కీలక మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు ఈ సమావేశానికి ఆహ్వానం అందిందా లేదా అన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. అలాగే సమావేశం అజెండాను కూడా టీవీకే అధికారికంగా వెల్లడించలేదు. దీంతో కాంగ్రెస్‌ను పక్కనపెట్టి టీవీకే మిగతా మిత్రపక్షాలతో భేటీ కావడం వెనుక రాజకీయ వ్యూహం ఏమిటన్న చర్చ మొదలైంది.

ఇదిలా ఉండగా, 2029లో విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్లు టీవీకేలో క్రమంగా బలపడుతున్నాయి. పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, నేతలు ఇప్పటికే ఈ అంశంపై బహిరంగంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

కవుండంపాళయం ఎమ్మెల్యే కనిమొళి మాట్లాడుతూ.. 2029 లోక్‌సభ ఎన్నికల్లో టీవీకే

రాణిపేట ఎమ్మెల్యే ఐ. తహీరా, మంత్రి ఆర్ఎన్ నిర్మల్ కుమార్ సహా పలువురు టీవీకే నేతలు.. విజయ్‌కు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర ఉండాలని అభిప్రాయపడుతున్నారు. అయితే టీవీకే నేతలు చేస్తున్న ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 2029 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీయే తమ ప్రధాని అభ్యర్థి అని కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టం చేసింది.

కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత థారహై కుత్‌బర్ట్ మాట్లాడుతూ.. విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేయడం కొందరు కొత్తగా ఎన్నికైన టీవీకే ఎమ్మెల్యేల వ్యక్తిగత అభిమాన ధోరణికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను కూటమి అధికారిక నిర్ణయంగా పరిగణించకూడదని ఆమె స్పష్టం చేశారు.

గతంలో విజయ్ స్వయంగా రాహుల్ గాంధీని కూటమి ప్రధాని అభ్యర్థిగా అంగీకరించిన విషయాన్ని కూడా థారహై కుత్‌బర్ట్ గుర్తుచేశారు. టీవీకే ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యక్తిగత వ్యాఖ్యలకు పార్టీ అధికారిక నిర్ణయంతో సంబంధం లేదని పేర్కొన్నారు.

మరోవైపు, విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేయడంపై తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు మాణిక్కం ఠాగూర్ కూడా ప్రశ్నలు సంధించారు. దేశానికి తదుపరి ప్రధాని ఎవరు కావాలన్నది చివరికి ప్రజలే నిర్ణయిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *