
వాణిజ్య ప్రయాణీకుల వాహనాల డ్రైవర్లకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆటోరిక్షా, టాక్సీ, యాప్ ఆధారిత క్యాబ్ డ్రైవర్లు మరాఠీ భాషపై కనీస అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి చేస్తూ నిబంధనలను సవరించింది.
ఇకపై ఆటో, టాక్సీ పర్మిట్లను కొత్తగా పొందాలన్నా, వాటిని పొడిగించుకోవాలన్నా డ్రైవర్లు మరాఠీ భాషా పరిజ్ఞానాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. మరాఠీ మాట్లాడటం రాని డ్రైవర్లపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలు పాటించేందుకు నెల రోజుల గడువు ఇచ్చిన అనంతరం, అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసేంత వరకు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.
మహారాష్ట్ర ప్రభుత్వం ఆటో, టాక్సీ, యాప్ ఆధారిత క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వాణిజ్య ప్రయాణీకుల వాహనాలు నడిపే డ్రైవర్లు, పర్మిట్ హోల్డర్లు స్థానిక భాష అయిన మరాఠీపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరాఠీ భాషా పరిజ్ఞానం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, పర్మిట్ల రద్దు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ నిబంధనలను అమలు చేసేందుకు మోటారు వాహనాల చట్టం, 1988లో మార్పులు చేస్తూ ‘మోటార్ సవరణ నిబంధనలు 2026’ను తీసుకురానున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీనికి సంబంధించిన అధికారిక తీర్మానాన్ని ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది.
ఒక నెల గడువు.. ఆపై లైసెన్స్ రద్దు!
సవరించిన 78, 85 నిబంధనల ప్రకారం ప్రతి ఆటో, టాక్సీ డ్రైవర్ కనీసం ప్రాథమిక స్థాయిలో మరాఠీలో సంభాషించగలగడం తప్పనిసరి. మరాఠీ మాట్లాడటం రాని డ్రైవర్లకు ప్రభుత్వం తొలుత ఒక నెల గడువుతో నోటీసు జారీ చేయనుంది.
ఈ గడువులోగా మరాఠీ భాషపై అవసరమైన పరిజ్ఞానం సాధించడంలో విఫలమైతే.. వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నెలల పాటు సస్పెండ్ చేసే అవకాశం ఉంది. సస్పెన్షన్ కాలం పూర్తయిన తర్వాత కూడా భాషా నైపుణ్యం సాధించకపోతే.. డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసేలా కొత్త నిబంధనల్లో కఠిన చర్యలను పొందుపరిచారు.

