
శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ట్రాఫిక్ ప్రధాన సమస్యగా మారింది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి గంటల కొద్దీ క్యూలైన్‌లో నిలుచోవడం ఒకెత్తయితే.. అలిపిరి వద్ద ట్రాఫిక్‌ను తప్పించుకోవడం మరో ఎత్తయింది. దీనికి ప్రధాన కారణం ప్రతి ఒక్కరూ సొంత వాహనాల్లో అక్కడికి రావడమే. శుక్ర, శని, ఆదివారాల్లో 33 వేల వాహనాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. గతంలో బస్సుల్లో ప్రయాణించడంతో ఈ సమస్య ఉండేది కాదని, ఇప్పుడు మనిషికో కారు కావడంతో భారీ ట్రాఫిక్ ఏర్పడుతుందని అధికారులు అంటున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని అందరికీ ఉంటుంది. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ప్రతి ఒక్కరూ వీకెండ్స్‌లోనే వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. శ్రీవారిని దర్శించుకోవడానికి గతంలో కంటే ఇప్పుడు చాలా కష్టమవుతుంది. స్వామివారి దర్శనాని కంటే ముందు తిరుమల ఎంటర్ కావడమే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. దానికి ప్రధాన కారణం ట్రాఫిక్.
ఒకప్పుడు తిరుమల వెళ్లాలంటే అందరూ బస్సులు, రైళ్లలోనే వెళ్లేవారు. తిరుపతిలో దిగిన తర్వాత కూడా ఆటోల్లో వెళ్లేవారు తక్కువ.. అక్కడ నుంచి కూడా బస్సులే ఎక్కేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం వేరు. మనిషికో కారు వేసుకుని తిరుమల బయల్దేరుతున్నారు. ఇదే తిరుమలలో ట్రాఫిక్ పెరగడానికి ప్రధాన సమస్య. వంద కార్లు ఉంటే ఐదు బస్సులు మాత్రమే అక్కడ కనిపిస్తున్నాయి. ప్రతీ నలుగురు కలిసి కార్లలో వెళ్లడంతో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోంది.
గడిచిన శుక్ర, శని, ఆదివారాల్లో దాదాపు 33 వేల వాహనాలు అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి తిరుమలకు చేరుకున్నాయి. ఇలా సొంత వాహనాల్లో రావడంతోనే భక్తుల రద్దీతో పాటు ట్రాఫిక్ సమస్య కూడా రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రస్తుతం తిరుమలకు వస్తున్న వాహనాల సంఖ్య రోజుకు 10 – 12 వేల వరకు ఉంటోంది. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతున్నాయి.
కేవలం వారాంతాల్లోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా రద్దీ విపరీతంగా ఉంటుంది. శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం 12 గంటల సమయం పడుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2, నారాయణగిరి షెడ్డులో నిండి రింగురోడ్డు, శాలాతోరణం వరకూ క్యూలైన్‌లో వేచి ఉన్నారు. రూ. 300 దర్శనం టికెట్ల ద్వరా మూడు గంటల్లో దర్శనం లభిస్తోంది. శ్రీవారిని ఆదివారం 87,179 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ. 4.59 కోట్లు వచ్చాయి. శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుపతి శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులకు సోమవారం ఒక్క రోజే 10 వేల ఎస్ఎస్‌డీ టోకెన్లు జారీ చేశారు.

