
వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో 13 మంది వైసీపీ నేతలపైనా కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించినందుకు పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు.
గత ఏడాది ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విక్రమ్‌రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు నాలుగు రోజులుగా ఆత్మకూరులో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
ఈ క్రమంలో సోమవారం మున్సిపల్ బస్టాండ్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. అయితే ర్యాలీకి ముందస్తు అనుమతి లేదని పేర్కొంటూ జేఆర్‌పేట వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ర్యాలీకి అనుమతి తీసుకోలేదన్న కారణంతో మేకపాటి విక్రమ్‌రెడ్డితో పాటు మరో 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

