
D news: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆక్సిజన్ సిలిండర్ లీకేజీ ఘటన తీవ్ర కలకలం రేపింది. జనావాసాల మధ్య ఉన్న ఆక్సిజన్ సిలిండర్ల నుంచి ఒక్కసారిగా గ్యాస్ లీక్ కావడంతో భారీ శబ్దంతో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటన ఈడేపల్లిలోని బెల్ కంపెనీ వెనుక రోడ్డులో చోటుచేసుకుంది.
సిలిండర్ల పేలుడు ధాటికి సమీపంలోని ఓ ఇంటి గోడలు బద్దలవ్వగా.. కారు, ద్విచక్ర వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. సిలిండర్లు పేలిన సమయంలో సమీపంలో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనావాసాల మధ్య ఆక్సిజన్ సిలిండర్లు ఉంచడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
జంగారెడ్డిగూడెం సమీపంలో ఘోర ప్రమాదం.. 30 మందికి గాయాలు
ఏలూరు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. హైవేపై నిలిపి ఉంచిన లారీని హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ఇంటర్‌సిటీ స్మార్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది.
బుధవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 30 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. లక్కవరం పోలీసులు బస్సు క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీశారు.
గాయపడిన ప్రయాణికులను జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

