
అమరావతి, సెప్టెంబర్ 7: పార్టీనే సర్వోన్నతంగా భావించాలని టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ పార్టీ నేతలకు సూచించారు. పార్టీ పదవుల్లో ఉన్న వారిని మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా తప్పనిసరిగా గౌరవించాలని స్పష్టం చేశారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ప్రారంభమైన రెండు రోజుల ఎమ్మెల్యేల శిక్షణ కార్యక్రమంలో లోకేశ్ పాల్గొని ప్రసంగించారు. పార్టీ ఏదైనా బాధ్యత అప్పగిస్తే దానికే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేయాలని ఆదేశించారు. పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఎవరినీ అనుమతి అడగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు బీ-ఫారం ఇస్తేనే ఎమ్మెల్యేలు, మంత్రులుగా పోటీ చేసే అవకాశం లభిస్తుందని.. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని లోకేశ్ వ్యాఖ్యానించారు. పార్టీని నిర్లక్ష్యం చేస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదనే విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాలని సూచించారు.
పార్టీ కార్యక్రమాలపై నిరంతర సమీక్ష
ప్రతి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయనే అంశంపై నిరంతరం సమీక్షించుకోవాలని లోకేశ్ సూచించారు. పార్టీ కార్యక్రమాల వివరాలను ‘మై-టీడీపీ’ యాప్లో అప్డేట్ చేస్తున్నామని తెలిపారు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని పార్టీ కార్యకలాపాల నిర్వహణ, కేడర్ పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
