D Spiritual: Nov 6: ఏకాదశి సందర్భంగా రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు

తెలుగు ప్రభ న్యూస్, మంత్రాలయం: పవిత్ర తుంగభద్ర నది తీరాన వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో గురువారం ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మఠం బృందావన అర్చకులు నిత్య పూజలకు విరామం కల్పించారు.

మూల బృందావనానికి ప్రత్యేక అర్చనలు

ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి నిత్య పూజలకు బదులుగా కేవలం నిర్మాల్య విసర్జనం, తులసి అర్చన మాత్రమే నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పించారు.

నిలిచిన నిత్య కార్యక్రమాలు

ఏకాదశి సందర్భంగా శ్రీ మఠంలో ప్రతిరోజూ నిర్వహించే ఉచిత భోజన కార్యక్రమం, ప్రసాద వితరణతో పాటు సాయంత్రం జరిగే రథోత్సవాన్ని నిలిపివేసినట్లు మఠం అధికారులు తెలిపారు.

భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు

ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టారు. ప్రవచన మండపంలో భజన కార్యక్రమాలు నిర్వహించి స్వామివారిని భక్తిశ్రద్ధలతో స్మరించుకున్నారు. మరోవైపు శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థులు మూలరామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.