విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ నుంచి కమర్షియల్ విమానాల రాకపోకలను నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. విశాఖకు చెందిన గోపాలకృష్ణ కొసరాజు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. 30 ఏళ్లకు పైగా సేవలందించిన విశాఖ విమానాశ్రయం నుంచి ఏకపక్షంగా విమాన సర్వీసులు నిలిపివేశారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

విశాఖ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సుమారు రూ.250 కోట్లు ఖర్చు చేసిందని పిటిషనర్ తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభం స్వాగతించదగినదే అయినప్పటికీ.. విశాఖ విమానాశ్రయం నుంచి సర్వీసులు పూర్తిగా నిలిపివేయడానికి సరైన కారణాలు లేవని వాదించారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ విశాఖ నగరానికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. కొత్త విమానాశ్రయానికి సరైన కనెక్టివిటీ లేకపోవడంతో విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి తిరిగి కమర్షియల్ విమాన సర్వీసులు నడపాలని కోరారు.

ఈ పిల్‌పై ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియా ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ అంశం పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సంబంధించినదని, కాబట్టి ఏపీ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. ఇదే అంశంపై ఏపీ హైకోర్టులో ఇప్పటికే పిల్ పెండింగ్‌లో ఉందని గుర్తించిన ధర్మాసనం.. ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిల్‌ను కొట్టివేసింది.

కాగా, విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆగస్టు 17 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో.. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ నుంచి కమర్షియల్ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. గతంలో విశాఖ నుంచి నడిచిన విమాన సర్వీసులను భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు తరలించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *