
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఇళ్ల స్థలాలపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ 24,042 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనుంది. ఈ నెల 30న విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పట్టాల పంపిణీ జరగనుంది.
మొత్తం 616.53 ఎకరాల భూమికి సంబంధించి పట్టాలు ఇవ్వనున్నారు. ఈ భూముల ప్రభుత్వ విలువ సుమారు రూ.9,798 కోట్లు కాగా, మార్కెట్ విలువ రూ.24,497 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని 15 మండలాలతో పాటు కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలంలోని లబ్ధిదారులు ఈ పట్టాలు పొందనున్నారు.
విజయవాడలో భారీగా పట్టాల పంపిణీ
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 227.11 ఎకరాలకు సంబంధించి 8,140 మందికి పట్టాలు ఇవ్వనున్నారు. ఈ భూముల విలువ రూ.4,034 కోట్లు కాగా, మార్కెట్ విలువ రూ.10,084 కోట్లుగా అంచనా.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 143.84 ఎకరాల్లో 6,790 మందికి, సెంట్రల్ నియోజకవర్గంలో 151.14 ఎకరాల్లో 6,325 మందికి పట్టాలు అందించనున్నారు. పశ్చిమ నియోజకవర్గ భూముల విలువ రూ.2,906 కోట్లు, మార్కెట్ విలువ రూ.7,264 కోట్లు కాగా.. సెంట్రల్ నియోజకవర్గంలో భూముల విలువ రూ.2,500 కోట్లు, మార్కెట్ విలువ రూ.6,249 కోట్లుగా అంచనా వేస్తున్నారు.
లబ్ధిదారుల్లో బీసీలు 12,084 మంది, ఓసీలు 6,124, ఎస్సీలు 4,546, ముస్లింలు 955, ఎస్టీలు 333 మంది ఉన్నారు. 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న కొన్ని భూములను తొలగించడంతో పాటు, ప్రభుత్వ భూములు, కొండ ప్రాంతాల్లో ఏళ్లుగా నివసిస్తున్న వారి స్థలాలను కూడా క్రమబద్ధీకరించినట్లు అధికారులు తెలిపారు.
ఇటీవల విశాఖపట్నంలో 28 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ప్రభుత్వం.. తాజాగా విజయవాడ, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో మరో 24,042 కుటుంబాలకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు సిద్ధమైంది.
