బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు, ఆరోగ్య పరిరక్షణ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఏపీ మంత్రి సవిత తెలిపారు. హాస్టళ్లు, గురుకులాలు, వాటి పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.

విజయవాడ గుణదలలోని బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో బుధవారం మంత్రి సవిత విద్యార్థినులకు శానిటరీ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లిఖార్జునతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి మంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. హాస్టల్‌లో గ్రంథాలయం ఏర్పాటు చేయాలన్న విద్యార్థినుల విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారు.

రూ.6 కోట్లతో శానిటరీ కిట్ల పంపిణీ

రాష్ట్రవ్యాప్తంగా బీసీ హాస్టళ్లలో సుమారు 1,200 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించినట్లు మంత్రి సవిత తెలిపారు. బీసీ హాస్టళ్లకు రూ.6 కోట్ల విలువైన శానిటరీ కిట్లను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఒక్కో కిట్‌లో 11 రకాల వస్తువులు ఉంటాయని వివరించారు. ఇప్పటికే హాస్టళ్లు, గురుకులాల్లో దోమతెరలు ఏర్పాటు చేయడంతో పాటు ఆర్వో ప్లాంట్లు, ఇన్వర్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.

విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు

బీసీ విద్యార్థుల భద్రత కోసం హాస్టళ్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. హాస్టళ్లలో మెనూ సక్రమంగా అమలు అయ్యేలా 142 మంది కుక్‌లు, కమాటీలను నియమించినట్లు తెలిపారు. విద్యార్థులకు ఇంటి వాతావరణాన్ని తలపించేలా హాస్టళ్లు, గురుకులాల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని చెప్పారు.

వచ్చే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో గతేడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, ఆరోగ్యకరమైన వాతావరణం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *