
అమెరికాలో విషాదం నెలకొంది. ఒహాయో రాష్ట్రంలోని క్లీవ్‌లాండ్‌లో జరిగిన యాక్సిడెంట్‌లో ఏపీకి చెందిన తెలుగు విద్యార్థి మృతిచెందాడు. అతను ప్రయాణిస్తున్న కారును ఓ పికప్ ట్రక్కు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు విద్యార్థి మృతి చెందాడు. ఒహాయో రాష్ట్రంలోని క్లీవ్‌లాండ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దిలీప్ కుమార్ ప్రయాణిస్తున్న కారును ఓ పికప్ ట్రక్కు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం జెట్టివారిపాలెం గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ కొన్నేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు. కెంట్ స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కుటుంబానికి అండగా భారత రాయబార కార్యాలయం
దిలీప్ కుమార్ మృతి పట్ల న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపింది.
దిలీప్ కుటుంబసభ్యులతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారని, మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తరలించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.

