
విశాఖ రుషికొండలో నిర్మించిన భవనాలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ భవనాలను ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రాతిపదికన లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. APTDC EOI (ఆసక్తి వ్యక్తీకరణ) కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 10లోగా ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలనిసూచించింది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.450 కోట్ల వ్యయంతో రుషికొండలో ఈ భవనాలు నిర్మించిన సంగతి తెలిసిందే.
విశాఖపట్నం రుషికొండలో ఉన్న భవనాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భవనాలను లీజుకు అప్పగించాలని.. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నారు. ఏపీటీడీసీ (ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ఆతిథ్య (Hospitality), పర్యాటక (Tourism) అనుబంధ సంస్థలలో ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. రుషికొండపై మొత్తం 9.8 ఎకరాల్లో గార్డెన్‌లు, రోడ్లు, వాక్ వేలు, పార్కింగ్ వసతులతో సహా ఐదు బ్లాకుల్లో సిద్ధంగా ఉన్న భవనాలను అప్పగిస్తామని ప్రకటనలో తెలిపారు. రుషికొండపై భవనాలు మాత్రమే కాదు 1200 చదరపు మీటర్ల ఖాళీ స్థలం కూడా ఉంది.. అక్కడ 4,800 చదరపు మీటర్లలో జీ+1 భవనాలు నిర్మించుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. జులై 10లోగా ఆతిథ్య (Hospitality), పర్యాటక (Tourism) రంగాలలో ఆసక్తి ఉన్న సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని ఏపీటీడీసీ సూచించింది.
రుషికొండపై ఉన్న భవనాలను తీసుకుని నిర్వహించేందుకు ఇంటర్నేషనల్ హోటల్ గ్రూపులైన తాజ్, లీలా, ఫెమా, అట్మాస్ఫియర్ కోర్‌లు గతంలోనే ఆసక్తి కనబరిచాయి. రుషికొండ భవనాలు కూడా ఈ హోటల్స్‌కు సంబంధించిన ప్రతినిధులు పరిశీలించారు. అయితే అక్కడ బస చేయడానికి ఎక్కువ గదులు లేకపోవడంతో.. కొత్తగా అదనంగా గదులు నిర్మించేందుకు ఏపీటీడీసీ ప్రకటన విడుదల చేసింది. పర్యాటకశాఖకు రుషికొండలో మొత్తం 70.63 ఎకరాల స్థలం ఉంటే.. 18.65 ఎకరాలు మాత్రమే వినియోగంలో ఉంది. మరో 47.4 ఎకరాలు ఖాళీగా ఉంది, మరికొంత ఆక్రమణలలో ఉందంటున్నారు.

