ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో వరుసగా రెండో రోజు శనివారం రాత్రి వరకు పోలీసు సిబ్బందిని విచారించింది. కస్టడీలో గాయపడిన సాయికృష్ణకు చికిత్స అందించేందుకు ఆర్‌ఎంపీని ఎవరి ఆదేశాలతో పిలిపించారు? ఆస్పత్రికి ఎందుకు తరలించలేదు? అనే అంశాలపై ఆరా తీసింది.

సాయికృష్ణకు చికిత్స అందించేందుకు కృష్ణలంకకు చెందిన ఆర్‌ఎంపీ శివకుమార్‌ను బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుల్‌ దర్కాబాబు తీసుకొచ్చినట్లు సమాచారం. సీఐ నాగరాజు ఆదేశాలతోనే ఆర్‌ఎంపీని తీసుకొచ్చినట్లు దర్కాబాబు సీబీఐ అధికారులకు తెలిపినట్లు తెలుస్తోంది. లాకప్‌ గదిలో రక్తపు మరకలు కనిపించకుండా పెయింట్‌ వేయించారనే అంశంపైనా అధికారులు విచారణ జరిపినట్లు సమాచారం. పోలీసుల నుంచి వివరాలు సేకరించేందుకు తెలుగు నుంచి ఇంగ్లిష్‌లోకి అనువదించే ట్రాన్సలేటర్‌ను ఏర్పాటు చేసుకున్నారు.

పోలీస్‌ స్టేషన్‌లో ఆధారాల సేకరణ

కేసులో కీలక ఆధారాల కోసం సీబీఐ అధికారులు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ బృందంతో కలిసి పరిశీలనలు చేపట్టారు. కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌, లాకప్‌ గదులు, ఇన్‌స్పెక్టర్‌, ఎస్‌ఐల చాంబర్లు, సిబ్బంది హాలు, రైటర్‌ క్యాబిన్‌ను వీడియో తీశారు. సీసీ కెమెరాలు, రెండో అంతస్తు, టెర్రస్‌పైనా ఆధారాల కోసం తనిఖీలు నిర్వహించారు.

సిట్‌ నివేదిక ప్రకారం సాయికృష్ణ మృతి చెందినట్లు గుర్తించిన ఎన్‌హెచ్‌ఏఐ భవనాన్ని కూడా పరిశీలించి నమూనాలు సేకరించారు. వీటిని హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించనున్నారు. సీబీఐ డీఐజీ శివసుబ్రమణి, దర్యాప్తు అధికారి నరేంద్రదేవ్‌ పోలీస్‌ స్టేషన్‌తో పాటు పాత భవనాన్ని పరిశీలించారు. అనంతరం పోలీస్‌ కమిషనరేట్‌కు వెళ్లి సీపీ రాజశేఖరబాబును కలిసి కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.

హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు

సాయికృష్ణ కస్టోడియల్‌ మృతి కేసులో పోలీసులే యువకుడిని కొట్టి చంపినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ నిర్ధారించినట్లు కథనాలు వెలువడ్డాయి. అనంతరం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు 11 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీబీఐ, సాక్ష్యాల సేకరణపై దృష్టి సారించింది. నిందితుల నివాసాల్లో ఆదివారం సోదాలు నిర్వహించనున్నట్లు సమాచారం.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *