ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య రాజకీయ వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల టీడీపీలో చేరిన విజయనగరం జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె సిరి సహస్ర నామినేషన్‌ వివాదాస్పదంగా మారింది. ఆమె కొత్తవలస, తెర్లాం జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, ఆమె బీసీ కాదంటూ వైసీపీ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.

అసలు పేరు, కుల ధ్రువీకరణ పత్రంపై అభ్యంతరాలు

సిరి సహస్ర అసలు పేరు ముస్కాన్‌ జైన్‌ అని, ఆమె తండ్రి పేరు రమేష్‌ కుమార్‌ జైన్‌ అని వైసీపీ ఆరోపిస్తోంది. జైన్‌ సామాజిక వర్గాన్ని రాష్ట్రంలో బీసీగా గుర్తించలేదని, ఆమెను మజ్జి శ్రీనివాసరావు, సునీత దంపతులు దత్తత తీసుకున్నారనే వాదనతో కుల అర్హత మారదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

తూర్పు కాపు బీసీ వర్గానికి చెందినట్లు పేర్కొంటూ రిజర్వుడ్‌ స్థానానికి నామినేషన్‌ వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా తహసీల్దార్‌ బీసీ సర్టిఫికెట్‌ ఎలా జారీ చేస్తారని, అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఎన్నికల అధికారులు నామినేషన్‌ను ఎలా స్వీకరిస్తారని వైసీపీ ప్రశ్నిస్తోంది.

నామినేషన్‌ ఫీజుపైనా ఫిర్యాదు

తెర్లాం జెడ్పీటీసీ స్థానానికి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి అక్టోబర్‌ 24న రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. బీసీ అభ్యర్థిగా పేర్కొంటూ రూ.6,000కు బదులుగా రూ.3,000 మాత్రమే నామినేషన్‌ ఫీజు చెల్లించారని ఆరోపించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అవసరమైన అర్హతలు, ఫీజు నిబంధనలను పాటించలేదని పేర్కొంటూ ఆమె నామినేషన్‌ను తిరస్కరించాలని కోరారు.

ఈ వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని విజయనగరం వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ వెల్లడించారు. సిరి సహస్ర నామినేషన్‌పై ఎన్నికల అధికారులు తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కాగా, ఇవన్నీ వైసీపీ చేసిన ఆరోపణలు, ఫిర్యాదులో పేర్కొన్న అభ్యంతరాలు మాత్రమే. వాటిపై అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *